అమరావతి: రాబోయే రోజుల్లో అవసరాలను, యువత ఆశయాలను గుర్తించి  పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం అందించేందుకు 'సమగ్ర పరిశ్రమ సర్వే' నిర్వహిస్తున్నట్లు పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని... ఈ సర్వే సగానికిపైగా పూర్తయిందన్నారు. 

 రాష్ట్రంలో త్వరలో 30 స్కిల్ కాలేజీల ఏర్పాటు చేయనున్నట్లు...ఇందుకు గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేశామని మంత్రి తెలిపారు. కాలేజీల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తయింది... పరిపాలన అనుమతులు కూడా వచ్చాయన్నారు. ఇక 30స్కిల్ కాలేజీలకు శంకుస్థాపనలే తరువాయి అని పేర్కొన్నారు. 

 పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి విజయవంతంగా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి మేకపాటిని ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా శాలువాతో సత్కరించారు. అలాగే రోజాను శాలువాతో సత్కరించిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...  ఏపీలో సంక్షేమంతో పాటే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందన్నారు.  కరోనా కాలంలోనూ ఏపీలో 1.58 శాతం అభివృద్ధి వుందన్నారు.  దేశంలో 10 శాతం ఎగుమతులే లక్ష్యంగా పనిచేస్తున్నాయని...  2030 సంవత్సరం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. 

read more  నాలుగున్నరలక్షల మంది చిన్నారులకు కరోనా సోకే చాన్స్: జగన్ సర్కార్ కు టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక

''రాష్ట్రంలో కొత్తగా 5 మేజర్ పోర్టుల నిర్మాణం జరగనుంది. 2023 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తవుతుంది. కర్నూలు ఎయిర్ పోర్టు ఇప్పటికే ప్రారంభమయింది.  మేం ఎక్కువ చేస్తున్నాం..... చేసినదానికన్నా తక్కువ చెప్పుకుంటున్నాం'' అన్నారు. 

''రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేస్తున్నాం.  3 కాన్సెప్ట్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఏపీని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలబెడతాం. సీఎం జగన్ ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి'' అని పేర్కొన్నారు. 

''ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1032 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  రూ.18000 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయి.  కరోనా సంక్షోభంలో ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అండగా నిలిచింది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఎంఎస్ఎంఈలకు చెల్లించాం. పారిశ్రామికాభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నాం.  రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నాం'' అని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 

 ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఏపీఐఐసీ ఎండీ , పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్  చల్లా మధుసూదన్ రెడ్డి, ఎమ్ఎస్ఎమ్ఈ సీఈవో పవనమూర్తి, , యాప్కో ఛైర్మన్ మోహనరావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.