అమరావతి: స్థానిక ఎన్నికలంటే వైసిపి భయపడుతోందని... తమ అఘాయిత్యాలు, అరాచకాలపై ప్రజలు వ్యతిరేక తీర్పు ఇస్తారనేదే ఆ పార్టీ భయానికి కారణమని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. వైసిపి దాడులు- దౌర్జన్యాలు, కూల్చివేతలు-విధ్వంసం, హత్యలు-ఆత్మహత్యలు, అత్యాచారాలు-అవినీతి కుంభకోణాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బాధిత కుటుంబాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తారనే భయం వైసిపి నాయకుల్లో కనిపిస్తోందని... అందువల్లే ఎన్నికలకు వెనుకడుగు వేస్తున్నారన్నారు. 

''నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యలు, రాజమండ్రిలో అబ్దుల్ సత్తార్ ఆత్మహత్యాయత్నం, పల్నాడులో వందకు పైగా ముస్లిం కుటుంబాల వెలి, దాచేపల్లిలో ముస్లిం చిన్నారిపై అత్యాచారం...మైనారిటీలు ఓటేయరనే భయం వైసిపిలో ఉంది.  నకరికల్లులో గిరిజన మహిళ మంత్రూ బాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపడం, కర్నూలులో భర్త ఎదుటే గిరిజన మహిళ  మానభంగం, తాజాగా గురజాలలో యలమంద నాయక్ ను రక్తం కక్కేటట్లు కొట్టడం...ఎస్టీలు ఓటేయరనే భయం వైసిపిలో ఉంది'' అన్నారు. 

''చీరాలలో కిరణ్ ను కొట్టి చంపడం, గురజాలలో విక్రమ్ హత్య, పుంగనూరులో ఓం ప్రతాప్ చావును ఆత్మహత్యగా చిత్రించడం, 3నెలల్లో 3జిల్లాలలో ముగ్గురికి శిరోముండనాలు, తాడిపత్రి, ఉదయగిరి, పనబాక, చంద్రగిరి, ఏర్పేడు, రాజమండ్రిలో దళిత బిడ్డలపై అత్యాచారాలు, విశాఖలో డా సుధాకర్, చిత్తూరులో డా అనితారాణి, పుంగనూరులో మేజిస్ట్రేట్ రామకృష్ణపై దమనకాండ...ఎస్సీలు ఓటేయరనే భయం వైసిపిలో కనిపిస్తోంది. అచ్చెన్నాయుడిపై, కొల్లు రవీంద్రపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపడం..బిసిలు ఓటేయరనే భయం వైసిపిలో అగుపిస్తోంది. అందుకే కరోనా వంకతో ఎన్నికల వాయిదా మంత్రం జపిస్తున్నారు'' అని తెలిపారు.

read more   గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

''ఎన్నికలు జరిగిన అమెరికాలో, శ్రీలంక, సౌత్ కొరియా, సింగపూర్, తదితర దేశాల్లో కరోనా లేదా..? బీహార్ ఎన్నికలకు కరోనా అడ్డం అయ్యిందా..? దుబ్బాక ఉప ఎన్నికకు కరోనా అడ్డం అయ్యిందా..? జిహెచ్ఎంసికి ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కూడా వస్తోంది. కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైసిపినే ఎందుకు చెబుతోంది..?ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెదో దారి..దేశం అంతా ఒకదారి అయితే, జగన్ రెడ్డిది ఇంకో దారి.. భయంతోనే వైసిపి స్థానిక ఎన్నికలకు వెనుకంజ వేస్తోంది'' అని పేర్కొన్నారు. 

''నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనేదే వైసిపి భయం. ఈసి వద్ద సమావేశానికి కూడా ఆ భయంతోనే వైసిపి గైర్హాజరయ్యింది. ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలంటే వైసిపి వెన్నులో వణుకుతోంది'' అన్నారు. 

''మాచర్లలో టిడిపి నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం, వాళ్లే మద్యం సీసాలు తెచ్చి టిడిపి నాయకుల ఇళ్లలో పెట్టి తప్పుడు కేసులు పెట్టడం, పోలీసుల ఎదుటే బెదిరించి నామినేషన్ పత్రాలు గుంజుకోవడం, అధికారుల ఎదుటే అభ్యర్ధులను లాక్కెళ్లడం, భయపెట్టి విత్ డ్రా చేయించడం..గత ఎన్నికల్లో వైసిపి దౌర్జన్యకాండకు తార్కాణాలు.
 కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే వైసిపి ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు వెనుకడుగు వేస్తోంది'' అన్నారు. 

''ఏడాదిన్నరగా 13వేల గ్రామాల్లో ఒక్క రోడ్డయినా వేశారా...? అసంపూర్తిగా ఉన్న అభివృద్ది పనులు పూర్తి చేశారా..? ఒక్క డ్రెయిన్ అయినా ఏ ఊళ్లోనైనా కట్టారా..? కట్టిన ఇళ్లు ప్రజల కళ్ల ముందే శిథిలం చేస్తారా..? పించన్లు ఇచ్చేది లేదని పేదలను వాలంటీర్లే బెదిరిస్తారా..? ప్రజాధనం పేదలకు పంపిణీలో వైసిపి వాలంటీర్ల పెత్తనం ఏమిటి..? రేషన్, పించన్లు జగన్ జేబుల్లోనుంచి ఏమైనా ఇస్తున్నారా..? వైసిపి వాలంటీర్ల రాజ్యం కాదు, గ్రామ స్వరాజ్యం కావాలి'' అని సూచించారు.

''టిడిపి హయాంలో గ్రామీణాభివృద్దిలో నూతన శకం...వైసిపి వచ్చాక ఏపిలో అరాచకాల యుగం.. రాష్ట్ర చరిత్రలో ఏ ఎన్నికల నిర్వహణలోనూ ఇన్ని అక్రమాలు చోటు చేసుకోలేదనే అపకీర్తిని వైసిపి తెచ్చింది. దమ్ముంటే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు వైసిపి సిద్దం కావాలి. బలవంతపు ఏకగ్రీవాలు పూర్తిగా రద్దు చేయాలి. మళ్లీ తాజాగా వాటన్నింటికి ఎన్నికలు జరపాలి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరపాలి'' అని డిమాండ్ చేశారు. 

''కొత్త జిల్లాల వంకతో ఎన్నికలు వాయిదా వేయాలని చూడటం పలాయనవాదం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని గ్రామాల్లో అభివృద్ది పనుల నిర్వహణకు, స్థానిక ఎన్నికలు సత్వరమే నిర్వహించాలి. 73,74వ రాజ్యాంగ అధికరణలను గౌరవించాలి. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నప్పుడు సిఎస్ జోక్యం అనవసరం. వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని సిఎస్ సూచించడం అనుచితం'' అని ఆరోపించారు. 

''ఎస్ఈసి కోరినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల సంఘానికి బదిలీ చేయాల్సిన బాధ్యత రాజ్యాంగాధినేతగా రాష్ట్రంలో గవర్నర్ దేనని ఆర్టికల్ 243కె(3) నిర్దేశిస్తోంది.
 కాబట్టి గవర్నర్ కూడా ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి స్థానిక ఎన్నికల నిర్వహణకు సహకరించాలి. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలి'' అని యనమల కోరారు.