గుంటూరు: రాజధాని అమరావతికి రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారా? అని ప్రభుత్వ సలహాదారు ప్రశ్నించడం హాస్యాస్పదంగా వుందని ఏపీ శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజధాని ఏర్పాటు ఏపి పునర్వవస్థీకరణ చట్టం ద్వారా జరిగిందని... రాష్ట్రపతి సంతకం ద్వారానే ఈ పునర్వవస్థీకరణ చట్టం వచ్చిందన్నారు.

''ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని గుర్తింపు కోసం కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. విజయవాడ-గుంటూరు మధ్య(అమరావతి) ప్రాంతాన్ని సూచించింది నిపుణుల కమిటీనే. నిపుణుల కమిటి సిఫారసులతోనే అమరావతిని రాజధానిగా చేయడం జరిగింది.రాష్ట్రపతి సంతకం చేసిన చట్టం, కేంద్రం నియమించిన కమిటి ఆధారంగానే అమరావతిని రాజధానిగా చేశారు. దానిని తరలించాలంటే మళ్లీ రాష్ట్రపతి సంతకం, కేంద్రం ఆమోదం తప్పనిసరి'' అని యనమల స్పష్టం చేశారు. 

''కేంద్రం తెచ్చిన చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్రం చట్టం చేస్తే రాష్ట్రపతి సంతకం విధిగా అవసరం. ఏపి రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 5(2) సబ్ సెక్షన్(1)లో ‘‘ఒక రాజధాని( A Capital)’’  అని స్పష్టంగా చెప్పారే తప్ప 3రాజధానులు అనలేదు. సెక్షన్ 6ప్రకారం ‘‘A new Capital’’ ప్రాంత గుర్తింపునకు నిపుణుల కమిటిని నియమించారు. సెక్షన్ 94(3), సెక్షన్ 94(4)లో కూడా రాజధాని గురించి, అందులో మౌలిక వసతుల గురించి స్పష్టంగా చెప్పారు'' అని వెల్లడించారు. 

read more   మీరలా చేయకుండా వుంటే బాగుండేది: గవర్నర్ కు సిపిఐ రామకృష్ణ లేఖ

''ఈ వాస్తవాలను వైసిపి ప్రభుత్వ సలహాదారులు తెలుసుకోవాలి. కేంద్ర చట్టాలు పూర్తిగా అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే సరైన సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం సముచితం'' అంటూ సజ్జలకు కౌంటర్ ఇచ్చారు. 

''ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కేంద్ర చట్టంతో ముడిపడిన అంశం. దానిని తోసిరాజని దొడ్డిదారిన రాష్ట్ర చట్టం తేవాలని చూడటంపైనే టిడిపి అభ్యంతరం. కేంద్ర చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్రం తెచ్చే చట్టానికి రాష్ట్రపతి సంతకం విధిగా అవసరం'' అని అన్నారు. 

''శాసన మండలి సెలెక్ట్ కమిటి వద్ద రాజధాని అంశం పెండింగ్ ఉంది. సెలెక్ట్ కమిటి వద్ద 2బిల్లులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఏజి హైకోర్టుకు తెలిపారు. సెలెక్ట్ కమిటి వద్ద 2బిల్లులు పెండింగ్ అని ప్రభుత్వమే ఒప్పుకుని, మళ్లీ గవర్నర్ వద్దకు బిల్లులు ఆమోదానికి పంపడం కోర్టు ధిక్కరణే అవుతుంది'' అని అన్నారు. 

''కేంద్రాన్ని, రాష్ట్రపతిని తోసిరాజని రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్దం. ఇటువంటి దుందుడుకు చర్యలకు ఇకనైనా స్వస్తి చెప్పాలి. రాష్ట్రపతిని, కేంద్రాన్ని, న్యాయస్థానాలను గౌరవించడం ప్రభుత్వాల విద్యుక్త ధర్మం'' అని యనమల సూచించారు.