దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబుపై కుట్ర జరగుతుందన్నారు ఏపీ ఆర్ధిక  మంత్రి యనమల రామకృష్ణుడు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీతి అయోగ్ సమావేశం, పీఏసీ ఛైర్మన్ బుగ్గన వ్యవహారశైలి గురించి వివరించారు. నీతి ఆయోగ్ సమావేశంలో అజెండా ప్రకారం కాకుండా వివిధ రాష్ట్రాల్లోని సమస్యలను చెప్పుకునే విధంగా ముఖ్యమంత్రులకు అవకాశం కల్పించాలని..కేవలం తనకు అనుకూలంగా ఉండే విధంగా కేంద్రం అజెండాను తయారు చేసుకోరాదని యనమల అన్నారు.

ప్రస్తుత నీతి ఆయోగ్ సమావేశం అన్ని రాష్ట్రాలకు అత్యంత కీలకమని... 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాల ప్రత్యేక పన్నుల విషయంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చంద్రబాబు సమావేశం కావడమన్నది రేపు ఢిల్లీలో ఉండే పరిస్ధితులను బట్టి ఉంటుందని తెలిపారు.

ఇక పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై మండిపడ్డారు... ఆ హోదాలో ఆయన సమాచారాన్ని బీజేపీకి అందించారని తమకు తెలిసిందని.. రాజ్యాంగం పేర్కొన్న నియమ నిబంధనల ప్రకారం అది కచ్చితంగా తప్పేనన్నారు.. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే.. సభా హక్కుల ఉల్లంఘనతో పాటు ఎథిక్స్ కమిటీ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని యనమల తెలిపారు.