అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ తక్షణమే స్పందించాలని టిడిపి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కానిస్టిట్యూషన్ బ్రేక్ డౌన్ ను అడ్డుకోవాల్సిన బాధ్యత గవర్నర్ దే అని అన్నారు. ఆర్టికల్ 243ఏ, ఆర్టికల్ 243కె(1) ప్రకారం ఎన్నికల నిర్వహణపై పూర్తి అధికారాలు ఎన్నికల సంఘానివే...ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని యనమల తెలిపారు.

''ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ మరియు నియంత్రణతో పాటు పంచాయతీలకు అన్ని ఎన్నికలను నిర్వహించే బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఇవ్వబడుతుంది'' అని స్పష్టంగా ఆర్టికల్ 243కె(1)లో ఉందని యనమల అన్నారు. పంచాయితీ ఎన్నికలపై ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. 
ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల నిర్వహణపై గవర్నర్ ను అభ్యర్ధించినప్పుడు కావాల్సిన ఉద్యోగులను కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి పంచాయితీ ఎన్నికలకు కావాల్సిన ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది గవర్నరేనని అన్నారు. 

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(3) రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరినప్పుడు నిబంధన(1) ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఇచ్చే విధులను నిర్వర్తించడానికి అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టంగా ఉందన్నారు. ఆర్టికల్ 243ఏ, ఆర్టికల్ 243కె(1) ఇవి రెండూ భారత రాజ్యాంగ పెద్దలు నిర్దేశించిన నిబంధనలని...
 రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఆర్టికల్ 356ను అట్రాక్ట్ చేసేలా ఉన్నాయన్నారు. 

read more  చంద్రబాబు వ్యాఖ్యల ఎఫెక్ట్: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

''చట్ట నిర్మాణ వ్యవస్థ( లెజిస్లేచర్), న్యాయ వ్యవస్థ(జ్యుడిసియరీ), పరిపాలనా వ్యవస్థ(అడ్మినిస్ట్రేషన్), మీడియా, పోలీసు వ్యవస్థ అన్నింటి నాశనమే ధ్యేయంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులు చెబుతోంది అదే. రాజ్యాంగంలో పేర్కొన్న ఈ 3ఆర్టికల్స్ ఉల్లంఘిస్తూ ఏపిలో ప్రభుత్వ నిర్వహణ ఉంది కాబట్టి, రాజ్యాంగ మెషీనరీ బ్రేక్ డౌన్ అయ్యాయి కాబట్టి ఆర్టికల్ 356 ను అట్రాక్ట్  చేసేలా ఏపిలో పరిస్థితులు ఉన్నాయి. రాజ్యాంగం మేరకు ఒక రాష్ట్రంలో పరిస్థితులు ప్రభుత్వ నిర్వహణకు, పరిపాలనకు అనుకూలంగా లేనప్పుడు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాల్సింది గవర్నరే'' అన్నారు.

''ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల తేదీలు ప్రకటిస్తే, దానికి సహకరించేది లేదని మంత్రులు, కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం దేశ చరిత్రలోనే లేదు, ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, మాన్యువల్ కు విరుద్దం. మద్యం దుకాణాల వద్ద క్యూల నిర్వహణకు అడ్డుచెప్పని ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణకు అడ్డుచెప్పడం హాస్యాస్పదం. అమెరికా ఎన్నికలు, బీహార్ ఎన్నికలు, అనేక ఉపఎన్నికలు, రేపు తమిళనాడు ఎన్నికలకు అడ్డుకాని కరోనా ఏపిలోనే స్థానిక ఎన్నికలకు ఆటంకమా..?'' అని ప్రశ్నించారు.

''పాఠశాలలు నడపడానికి, ముఖ్యమంత్రి పుట్టిన రోజు, మంత్రుల పెళ్లి రోజులకు అడ్డంకాని కరోనా స్థానిక ఎన్నికలకు అడ్డమా..? మద్యం దుకాణాల వద్ద క్యూ కట్టడం, వైకాపా సంబరాలు, పట్టాల పండుగలకు అడ్డం కాని కరోనా పంచాయితీ ఎన్నికలకు అడ్డమా..? ద్వంద్వ ధోరణితో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కోవిడ్ పోతే నిర్వహిస్తారా,  ఈసి పోతే నిర్వహిస్తారా..? ఈ దొంగాటకాలు ఎందుకు..? 2022జూన్  దాకా కోవిడ్ ప్రభావం ఉంటుందని కొన్ని నివేదికలు ఉన్నాయి. అప్పటిదాకా స్థానిక ఎన్నికలు జరపరా..?'' అంటూ ప్రభుత్వాన్ని యనమల నిలదీశారు.