విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఫిలిప్ సి తోచర్ శనివారంనాడు టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన టీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు రాజీనామా లేఖను పంపించారు. 

ఆ తర్వాత తోచర్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వైఖరి, ఆ పార్టీ వైఖరి అసహ్యం పుట్టిస్తోందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మెడలో శిలువ వేసుకుని బైబిల్ చదువుతూ తన జన్మ ధన్యమైందని ప్రకటించుకున్నారని ఆయన గుర్తు చేశారు. 

రామతీర్థం, ఇతర దేవాలయాల్లో జరిగిన ఘటనలతో క్రైస్తవానికి ఏ విధమైన సంబంధం లేదని, రాజకీయాల కోసం క్రైస్తవాన్ని అవమానిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు పార్టీలో ఎలా కొనసాగుతున్నారంటూ రాష్ట్రంలోని క్రైస్తవులు తమపై ఒత్తిడి పెడుతున్నారని ఆయన చెప్పారు. 

క్రైస్తవులను అవమానిస్తున్న చంద్రబాబు వైఖరి, పార్టీ వైఖరి నచ్చక పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఫిలిప్ సి. తోచర్ 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ కోటాలో టీడీపీ నామినేట్ చేసింది.