Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ ఆల్ టైమ్ రికార్డు... ఐదేళ్లలో మూడున్నర లక్షల కోట్ల అప్పు: యనమల

అప్పుల కుప్పలు, భవిష్యత్ రుణభారం, ప్రజలకు తిప్పలు తప్ప వైసిపి రెండో ఏడాది బడ్జెట్ లో ఏముంది ఘనత అని మాజీ ఆర్ధికమంత్రి, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. 

yanamala comments on ap budget 2020
Author
Amaravathi, First Published Jun 20, 2020, 9:23 PM IST

గుంటూరు: అప్పుల కుప్పలు, భవిష్యత్ రుణభారం, ప్రజలకు తిప్పలు తప్ప వైసిపి రెండో ఏడాది బడ్జెట్ లో ఏముంది ఘనత అని మాజీ ఆర్ధికమంత్రి, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. తొలిఏడాది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నిరంగాల్లో దారుణంగా విఫలమైందన్నారు. జరిగిన అభివృద్ది శూన్యమని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. ప్రచారం ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగింది కూడా శూన్యమన్నారు. 

''ఆర్ధిక పురోగతిలో, ద్రవ్య నిర్వహణలో తిరోగమనం. రెండంకెల వృద్ది నుంచి 8.16%కు దిగజారిందని ప్రభుత్వ లెక్కలే చెప్పాయి కానీ వాస్తవంగా చూస్తే అందులో సగమే. దురుద్దేశపూర్వకంగానే సోషియో ఎకనామిక్ సర్వే లెక్కలన్నీ తప్పుల తడకలుగా చెప్పారు. రెవిన్యూ రాబడులు పడిపోయి, రెవిన్యూ వ్యయం పెరిగిపోయి, కేపిటల్ ఎక్స్ పెండిచర్ మూడింట 2వంతులు కోతపెట్టి, ద్రవ్యలోటు అమాంతం పెంచేశారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని రుణాంధ్ర ప్రదేశ్ గా చేశారు'' అని మండిపడ్డారు.

''రెవిన్యూ రాబడులు 2019-20లో 37.9% పడిపోయాయి. రూ 67,826కోట్లు తగ్గిపోయాయి. రెవిన్యూ వ్యయం 6.96% పెరిగిపోయింది. రూ 8,949కోట్లు రెవిన్యూ వ్యయం పెరిగింది. 
కేపిటల్ ఎక్స్ పెండిచర్(మూలధన వ్యయం) 35% పడిపోయింది. రూ 7,131కోట్లు మూలధన వ్యయం పడిపోవడం వైసిపి దారుణ వైఫల్యం'' అని అన్నారు. 

''2019-20లో మొత్తం బడ్జెట్  వ్యయం 6.6% పడిపోవడం ఆందోళనకరం. రూ10,798కోట్లు తగ్గిపోయింది. టిడిపి హయాంలో 5ఏళ్లలో సగటున మొత్తం బడ్జెట్ వ్యయం 100% చేశాం. ఈ ఏడాదిలోనే కేపిటల్ ఎక్స్ పెండిచర్ 35% తగ్గిపోవడం చేతగానితనమే.. కేపిటల్ ఎక్స్ పెండిచర్ 35% పడిపోయిందంటే, గత ఏడాదిగా రాష్ట్రంలో వైసిపి చేసిన అభివృద్ది నిల్ అనేది రూఢీ అయ్యింది. రెవిన్యూ డెఫిసిట్ 91% పెరిగిపోయింది. రూ12,748కోట్లు రెవిన్యూలోటు పెరిగిపోవడం వైసిపి చేతగానితనమే. అనుత్పాదక వ్యయానికి చేసిన అత్యధిక ఖర్చుల వల్లే రెవిన్యూ డెఫిసిట్ పెరిగిపోయిందనేది వాస్తవం'' అని అన్నారు. 

read more  పది పరీక్షలు రద్దు, ఇంటర్ ఫెయిల్ అయినవారు కూడా పాస్: ఏపీ ప్రభుత్వం

''ఫిస్కల్ డెఫిసిట్(ద్రవ్యలోటు) 14% పెరిగిపోయింది. రూ5,053కోట్లు ద్రవ్యలోటు పెరిగి పోవడం వైసిపి వైఫల్యమే. వడ్డీ చెల్లింపులు + ప్రజారుణం రీపేమెంట్ 20.9% పెరిగిపోయింది. రూ5,501కోట్లు పెరిగాయి.  బహిరంగ మార్కెట్ లో అప్పులు 72.6% పెంచేశారు. ఒక్క ఏడాదిలోనే బహిరంగ మార్కె ట్ అప్పులు రూ25,243కోట్లు తెచ్చారు. హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ దీనికి అదనం.  ఏడాదికి రూ 60వేల కోట్ల అప్పుల చొప్పున పెరిగితే, 2023-24నాటికి మొత్తం అప్పులు రూ 3,02,202కోట్ల నుంచి రూ 6,50,000కోట్లకు పెరగనున్నాయి'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
''రాబోయే 5ఏళ్లలో అదనంగా రూ3,47,790కోట్లకు(115%) రుణభారం పెరగనుంది. అంటే ఈ రుణాలపై వడ్డీ చెల్లింపుల భారం కూడా ఏడాదికి రూ34వేల కోట్ల చొప్పున పెరగనుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోయే 5ఏళ్లలో(2019-24) మొత్తం అప్పులపై వడ్డీ చెల్లింపులకే రూ 1,60,000కోట్లు ఖర్చు చేయాల్సివస్తుంది. 1956నుంచి ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత మొత్తం 64ఏళ్ల చరిత్రలో చేసిన అప్పులు రూ 3లక్షల కోట్లు ఉంటే రాబోయే 5ఏళ్లలోనే రూ మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసేందుకు వైసిపి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. 64ఏళ్లలో ఏడాదికి సగటున అప్పుల భారం రూ5వేల కోట్లు ఉంటే , ఈ ఏడాదే వైసిపి ప్రభుత్వం రూ 60వేల కోట్ల పైబడి అప్పులు చేశారంటే ఏ స్థాయిలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచుతున్నారో తెలుస్తోంది'' అని అన్నారు. 

''జిఎస్ డిపి లో అప్పుల నిష్పత్తిని  27% నుంచి 34.5%కు పెంచేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై 2018-19లో రూ14వేల కోట్లు టిడిపి ప్రభుత్వం ఖర్చు పెడితే, గత ఏడాది రూ4వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడం, అభివృద్ది ప్రాజెక్టుల పట్ల వైసిపి నిర్లక్ష్యానికి పరాకాష్ట. వ్యవసాయానికి పెట్టిన రూ29వేల కోట్ల బడ్జెట్ అంకెల గారడియే తప్ప వ్యవసాయానికి ప్రత్యేకంగా నిధులు పెంచిందేమీ లేదు. నరేగా నిధులు, విపత్తు నిధి, స్థిరీకరణ నిధి, విద్యుత్ సబ్సిడీ అన్నింటినీ వ్యవసాయ బడ్జెట్ లో కలిపేసి మాయాజాలం చేశారు'' అని అన్నారు. 

''పారిశ్రామికీకరణను దారుణంగా నిర్లక్ష్యం చేశారు. పెట్టుబడుల వ్యతిరేక వాతావరణం రాష్ట్రంలో కల్పించారు. దీనితో యువత ఉపాధి కోల్పోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, ప్రభుత్వానికి రెవిన్యూ లేకుండా పోయింది. గత ఏడాది సబ్ ప్లాన్ నిధుల్లో సగం పైగా ఖర్చు చేయలేదు. అందరికీ కలిపి ఇచ్చే సంక్షేమ పథకాల నిధులనే సబ్ ప్లాన్ లలో చూపి ఈ ఏడాది బడ్జెట్ లో బిసి,ఎస్సీ,ఎస్టీ, ముస్లిం మైనారిటీలను మోసం చేశారు. సబ్ ప్లాన్ నిధుల లక్ష్యం ఆయా వర్గాల జనావాసాల్లో అభివృద్ది పనులు చేపట్టడం, మౌలిక వసతులు కల్పించడం,అదనపు సంక్షేమం అందించడం. అలాంటిది సబ్ ప్లాన్ లక్ష్యాన్నే వైసిపి నాయకులు దొంగదెబ్బతీశారు'' అని ఆరోపించారు. 

''పేదల కోసం టిడిపి ప్రభుత్వం తెచ్చిన 34పథకాలను రద్దుచేసి సంక్షేమానికి తూట్లు పొడిచారు. ఆర్ధిక నిర్వహణలో ఈ విధమైన వైఫల్యాల వల్ల భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకు పోవడమే కాకుండా సమాజంలో పేదరికం నిర్మూలనకు దోహదపడే ఆస్తుల కల్పనకు విఘాతం కల్గుతుంది. అంతేగాకుండా ఈ ద్రవ్యలోటుల కారణంగా ఆర్ధిక మద్దతు కోసం, మార్కెట్ అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది'' అంటూ మాజీ ఆర్థికమంత్రి యనమల ఆందోళన వ్యక్తం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios