ఏపీలో అధికార, ప్రతి పక్ష పార్టీల మధ్య యుద్ధం ట్విట్టర్ వేదికగా నడుస్తోంది. ఒకరు చేసిన కామెంట్స్ కి మరొకరు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ప్రజా వేదిక భవనాన్ని తనకు కేటాయించాలంటూ... చంద్రబాబు .. సీఎం జగన్ కి రాసిన లేఖ విషయంలో ఈ వివాదం చోటు చేసుకోవడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రజా వేదిక తనకు కేటాయించాలని ఇటీవల చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖపై ఇప్పటి వరకు సీఎం జగన్ స్పందించలేదు కానీ... ఆ పార్టీ నేతలు మాత్రం స్పందిస్తున్నారు. ఇప్పటికే ఆ భవనం తమకు కావాలని కొందరు వైసీపీ నేతలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే... సీఎం కి మొదట రాసే లేఖ ఇదేనా చంద్రబాబు అంటూ విజయసాయి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

దీనిపై యనమల స్పందించారు. అదేమీ చంద్రబాబు మొదటరాసిన లేఖ కాదని గుర్తు చేశారు. అధికారంలో ఉండి కూడా అబద్ధాలు ఆడుతున్నారని మండిపడుతూ విజయసాయికి కౌంటర్ ఇచ్చారు. అయితే... ఆ కౌంటర్ కి తాజాగా విజయసాయి రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

‘‘యనమల గారూ... మీరు అడగటం, మేం ఇవ్వటం మొదలుపెడితే లోకేష్‌ కోసం ప్రకాశం బ్యారేజీ, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు కూడా ఇవ్వమని అడగగల సమర్ధులు మీరు!. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు గారూ? కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని సమీక్షల్లో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారు. జన్మభూమి కమిటీలనే పచ్చ మాఫియాను సృష్టించి ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం?" అని విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే విజయసాయి వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.