అమరావతి: తమపై వైసిపి ప్రభుత్వం పెట్టిన అక్రమకేసులు కొట్టేసేలా పోలీసులను ఆదేశించాలని మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలు ఏపి హైకోర్టును కోరారు. తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం వారు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశించింది. 

ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసిన హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరో లంచ్‌మోషన్‌ పిటిషన్ కూడా హైకోర్టులో  దాఖలయ్యింది. మాజీ ఎమ్మెల్యే పి. అనంతలక్ష్మి,  భర్త సత్యనారాయణలు కూడాహైకోర్టును ఆశ్రయించారు.

read more   పుకార్లు: ఏ క్షణంలోనైనా అయ్యన్నపాత్రుడి అరెస్టు

వీరిపై నమోదయిన కేసు వివరాలిలా ఉన్నాయి. టిడిపి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కొడుకుకు మొదటి భార్య వుండగానే రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నించారన్నది వీరిపై అభియోగం. అతడి మొదటి భార్య జిల్లా ఎస్పీని కలిసి భర్త, అత్తామామలతో పాటు మాజీ మంత్రులు యనమల, చినరాజప్పలపై కూడా ఫిర్యాదు చేసింది. 

యనమల స్వగ్రామంలో మాజీ మంత్రులిద్దరు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. ఈ పిర్యాదుతో మాజీ మంత్రులిద్దరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంతో సంబంధాలున్నట్లు అనుమానిస్తూ తుని నియోజకవర్గం తొండంగి పొలీసు స్టేషన్ లో ఏడుగురిపై (క్రైం. నెం: 230) ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. 

2011లో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ కుమారుడు రాధాకృష్ణను ప్రేమ వివాహం చేసుకున్నట్లు బాధితురాలు చెబుతోంది. రెండు రోజుల క్రిందట మళ్లీ అతడికి  మాజీ మంత్రి యనమల స్వగ్రామంలో రెండో వివాహం జరిపించేందుకు ప్రయత్నించారని చెబుతోంది.పెళ్లి పెద్దలుగా మాజీ మంత్రులు ఇద్దరూ వెళ్లారని ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వారిపై కేసులు నమోదు చేశారు. 

తాజాగా టిడిపి నాయకుల వరుస అరెస్టుల నేపథ్యంలో ఈ కేసులో యనమల, చినరాజప్పలను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే వారు ముందుగానే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలస్తోంది.