విజయవాడ: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.  

తనను అసభ్యకరంగా దుర్భాషలాడారని అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 354a,500,504,506,509,505b సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన్నపాత్రుడిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చునని టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి.

కాగా, మున్సిపల్ కమిషనర్ ను దూషించిన అయ్యన్నను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ వర్గాలు డిమాండ్ చేశాయి. అయ్నన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల వీడియో బయటకు వచ్చింది. ఆయన మహిళా కమిషనర్ మీద చేసిన తీవ్ర వ్యాఖ్యలు అందులో రికార్డయ్యాయి.

Also Read: గుడ్డలూడదీయాల్సిన దుస్థితి... అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు: పోలీసులకు మహిళా కమీషనర్ ఫిర్యాదు

ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుతో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలింది. ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. అంతేకాకుండా వాహనాల అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఇదిలావుంటే, తమపై పెట్టిన కేసులను ఎత్తేయాలని మాజీ మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు హైకోర్టును ఆశ్రయించారు. ఏ పెళ్లికి హాజరైన సంఘటనలో వారిపై కేసులు నమోదయ్యాయి.