తుఫానుగా మారిన వాయుగుండం... తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎలా ఉండనుందంటే...
యాస్ తుఫాను ప్రభావంతో నేడు, రేపూ తెలంగాణలో... నేడు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం తెల్లవారుజామున తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ యాస్ తుఫాను ఒడిషాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. ఇది నెమ్మదిగా ఉత్తర వాయవ్యంగా పయనిస్తోందని... రేపటికి తీవ్ర తుఫానుగా, ఎల్లుండి అతి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఈనెల 26 నాటికి బెంగాల్-ఒడిషా తీరాలను చేరి ఆరోజు మధ్యాహ్నమే పారాదీప్, సాగర్ దీవుల మధ్య తీరందాటవచ్చని ప్రకటించారు.
ఈ యాస్ తుఫాను ప్రభావంతో నేడు, రేపూ తెలంగాణలో... నేడు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపారు. కోస్తాంధ్రలో తీరప్రాంతాల్లో గాలులు, అలల ఉద్ధృతి మినహా దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని... శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక బంగాళఖాతంలో ఏర్పడి ప్రమాదకరంగా తీరంవైపు దూసుకువస్తున్న ఈ యాస్ తుఫానుపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ వర్చువల్ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎంతో పాటు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు.. వి.ఉషారాణి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.