కేసీఆర్ ప్రభుత్వంపై మాట్లాడే దమ్ముందా అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి రోజా సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం గురించి అవాకులు చెవాకులు పేలితే మక్కిలిరగ్గొడతారని అన్నారు. హైదరాబాద్‌లో బతకలేనని నోరెత్తరని పేర్కొన్నారు. 

అమరావతి: ఏపీ మంత్రి రోజా మంగళవారం.. పవన్ కళ్యాణ్ మీద నిప్పులు చెరిగారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. విమెన్ ట్రాఫికింగ్ అని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వివరించారు. ప్రజా సేవ చేస్తున్న వాలంటీర్లపై ఇలాంటి వ్యాఖ్యను ఒక మహిళగా తాను ఎంతమాత్రం సహించబోనని స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తే పవన్ కళ్యాణ్‌కు, చంద్రబాబుకు తాము ఓడిపోతామనే విషయం బోధపడిందని అర్థం అవుతున్నట్టు రోజా పేర్కొన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను సాధారణ ప్రజలకు నేరుగా అందిస్తున్నారని, దీని వల్ల వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నదని, ఇలా సామాన్య ప్రజల గుండెల్లోనూ వైసీపీ ముద్రపడటాన్ని పవన్ జీర్ణించుకోవడం లేదని విమర్శించారు. 

మహిళలన్నా, వాలంటీర్లన్నా పవన్ కళ్యాణ్‌కు గౌరవం లేదని, వారిని అపకీర్తిపాలు చేసేలా మాట్లాడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని నిఘా వర్గాలు చెప్పాయని ఇక్కడ కారుకూతులు కూస్తున్నారని రోజా మండిపడ్డారు. నిజానికి ఎన్సీఆర్బీ డేటాలో మహిళల అక్రమ రవాణా విషయంలో టాప్ టెన్‌లో ఆంధ్రప్రదేశ్ లేదని అన్నారు. తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నదని తెలిపారు. 

Also Read: మాజీ భార్యతో ప్రస్తుత భార్యకు ఫ్రెండ్షిప్.. ఇద్దరు కలిసి భర్తను చంపేశారు!

తెలంగాణ వెళ్లి కేసీఆర్‌ను నిలదీసే దమ్ము పవన్ కళ్యాణ్‌కు ఉన్నదా? అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడే దమ్ముందా? ఒక వేళ మాట్లాడితే నీ మక్కెలిరగ్గొడతారనే భయం పవన్ కళ్యాణ్‌కు ఉన్నదని వివరించారు. హైదరాబాద్‌లో తాను బతకలేనని భయంతోనే అక్కడ మాట్లాడవని ఆరోపించారు.

ఆయన అభిమానులపై నోరుపారేసుకున్న వారితోనూ పవన్ కళ్యాణ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మంత్రి రోజా అన్నారు. ప్యాకేజీ కోసం ఎవరిని తిట్టినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. జగన్‌ను ఏకవచనంతో పిలుస్తానని, ఆయనకు గౌరవం ఇవ్వనని పవన్ కళ్యాణ్ అంటున్నారని రోజా అన్నారు. ఏపీ ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని, నీ గౌరవం ఎవరికి కావాలి అంటూ ప్రశ్నించారు.