‘సభలో ప్రత్తిపాటి పుల్లారావైనా ఉండాలి-లేదా జగన్మోహన్ రెడ్డైనా ఉండాలి’ .
‘సభలో ప్రత్తిపాటి పుల్లారావైనా ఉండాలి-లేదా జగన్మోహన్ రెడ్డైనా ఉండాలి’ . ‘విచారణలో ప్రత్తిపాటిది తప్పని తేలితే పుల్లారావును వెలేస్తాం. జగన్ ది తప్పని తేలితే జగన్ను కూడా వెలేస్తాం’. ‘అందుకు జగన్ సిద్ధమైతే జ్యుడీషియల్ విచారణకు ప్రభుత్వం సిద్ధమే.’ ఇది...చంద్రబాబునాయుడు నిండు అసెంబ్లీలో విసిరిన సవాలు. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంలో సభ సవాళ్లు-ప్రతిసవాళ్ళతో దద్దరిల్లిపోయింది. దాదాపు గంటసేపు సభలో ఒకరిపై మరొకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
ప్రతిపక్ష నేత జగన్ అగ్రిగోల్డ్ విషయమై మాట్లాడుతూ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన భార్య పేరుతో ఆస్తులు కొనుగోలు చేసారంటూ ఆరోపించారు. జగన్ ఆరోపణలకు ప్రత్తిపాటి తీవ్రంగ స్పందించారు. దాంతో సభలో గందరగోళం మొదలైంది. ప్రత్తిపాటి మాట్లాడుతూ తన భార్య భూములు కొనుగోలో చేయలేదన్నారు. ఒకవేళ కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. ఒకవేళ నిరూపించలేకపోతే జగన్ రాజకీయాల నుండి తప్పుకుంటారా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. దాంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది.
ప్రత్తిపాటికి మద్దతుగా సహచర మంత్రులు అచ్చెన్నాయడు, యనమల రామకృష్ణుడుతో పాటు బుచ్చయ్య చౌదరి తదితరులు మాట్లాడారు. ఎవరెంత మాట్లాడిన జగన్ ప్రత్తిపాటి డిమాండ్ చేసినట్లు హౌస్ కమిటి విచారణ గురించి మాట్లాడలేదు. దాంతో ప్రత్తిపాటి సవాలుకు సమాధానం చెప్పిన తర్వాతే జగన్ మాట్లాడాలంటూ అధికార పక్షం పట్టుపట్టింది. హౌస్ కమిటి వేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, మెజారిటి సభ్యుల మద్దతుతో ప్రివిలేజ్ కమిటీ లాగే తయారవుతుందని జగన్ అన్నారు. ఈ కమిటీకన్నా సిట్టింగ్ జడ్జ్ తో జ్యుడిషియల్ విచారణకు సిద్ధమేనా అంటూ జగన్ ప్రతిసవాలు విసిరారు.
ఇంతలో చంద్రబాబునాయడు జోక్యం చేసుకున్నారు. ప్రత్తిపాటి సవాలుకు జగన్ అంగీకరిస్తే ఎటువంటి కమిటి వేయటానికి కూడా సిద్ధమేనన్నారు. విచారణలో తప్పెవరిదో తేలిన తర్వాత సభలో ఉంటే ప్రత్తిపాటి పుల్లారావో లేకపోతే జగనో ఎవరో ఒకరే ఉండాలంటూ ఆవేశంతో ఊగిపోయారు. మధ్యలో అగ్రిగోల్డ్ వ్యవహారం పూర్తిగా పక్కదారిపట్టటం గమనార్హం.
