గ్రామంలో కరుడుగట్టిన దొంగలు తిరుగుతున్నారన్న వార్తను అవకాశంగా తీసుకుని ఓ మహిళ దొంగతనం చేయాలనుకుంది.. అమ్మాయిలా వెళితే కష్టమని చెప్పి అబ్బాయిలా మారిపోయింది.. తీరా అనుకున్న పని జరక్కపోగా.. అడ్డంగా బుక్కయిపోయింది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలానికి చెందిన కాటూరి సత్యవతికి చౌటపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కొన్నేళ్ల కిందట వివాహమైంది. భర్తతో విభేదాలు రావడంతో పొన్నలూరు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ.. అద్దె ఇంట్లో నివసిస్తోంది.

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ మెడలో చైను, నల్లపూసల దండ ఉండటాన్ని గమనించింది.. గ్రామంలో పార్థీ గ్యాంగ్ తిరుగుతుందన్న పుకారును అవకాశంగా తీసుకుని దొంగతనానికి ప్లాన్ గీసింది.. మామూలుగా వెళ్తే ఎవరైనా గుర్తుపడతారని.. చొక్యా, ప్యాంటు ధరించి.. ముఖానికి నల్లరంగు పూసుకుని దొంగతనానికి వెళ్లింది..

సదరు మహిళ మేత ఎత్తుకుని వస్తున్న సమయంలో వెనుకవైపుగా వచ్చి ఆమె కళ్లలో కారం చల్లి మెడలోని బంగారు నల్లపూసల దండ లాగింది.. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పక్క పొలాల్లో ఉన్న గ్రామస్తులు పరుగు పరుగున అక్కడికి వచ్చి... సత్యవతిని గట్టిగా పట్టుకుని ఆరా తీయగా ఆమె ఎవరో తెలిసిపోయింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.