నరసరావుపేట మున్సిపల్ కమీషనర్  తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మిద్దె లక్ష్మి అనే మహిళ పల్నాడు కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

పల్నాడు: పెరిగిన పన్నులు కట్టలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటూ ఏపీ ప్రజానీకం బాధపడుతుంటే ఓ మహిళ మాత్రం పన్ను కట్టనివ్వడం లేదంటూ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి సిద్దమైంది. ఈ ఘటన పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. తన సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగిన మహిళ వెంటతెచ్చుకున్న పెట్రోల్ పోసుకోడానికి ప్రయత్నించగా చుట్టుపక్కల ఉన్నవారు అడ్డుకున్నారు. 

బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన మిద్దె లక్ష్మీ ఇళ్లు వివాదంలో వుంది. అయితే ఇటీవలే ఆ ఇంటి వివాదం పరిష్కారమైనా మున్సిపల్ కమీషనర్ లంచాల కోసం ఇంటి పన్ను వేయకుండా వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. మున్సిపల్ అధికారులంతా ఇల్లు తనదేనని దృవీకరించినా కమీషనర్ మాత్రం పన్నులు వేయడానికి లక్ష రూపాయలు లంచమివ్వాలని అడుగుతున్నాడని ఆమె ఆరోపిస్తోంది. 

Video

కమీషనర్ అడిగినంత లంచం ఇచ్చుకోలేనని... అలాగని ఇంటిని వదులుకోలేనని బాధితురాలు వాపోయింది. ఉన్నతాధికారులపై నమ్మకంతోనే తనకు న్యాయం జరుగుతుందని కలెక్టరేట్ కు వచ్చానని మహిళ తెలిపింది. అయితే ఇక్కడా తనగోడు వినేవారు లేకోవడంతో వెంటతెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని కాల్చుకుని చావాలని భావించినట్లు తెలిపారు. అయితే కలెక్టరేట్ వద్దగల కొందరు మహిళ చేతిలోంచి పెట్రోల్ బాటిల్ లాక్కుని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. 

ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బాధిత మహిళతో మాట్లాడారు. ఆమె సమస్యను విన్న జేసి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో మహిళ కలెక్టరేట్ నుండి ఇంటికి వెళ్లిపోయింది.