వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారం ఢిల్లీకి చేరింది. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీకి చెందిన పలువురు మహిళా నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. 

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారం ఢిల్లీకి చేరింది. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీకి చెందిన పలువురు మహిళా నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. డిగ్నిటీ ఫర్‌ ఉమెన్‌ పేరుతో వివిధ మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా విభాగం నేతలు జేఏసీగా ఏర్పడ్డారు. వీరిలో వంగలపూడి అనిత, జ్యోత్స్న, పద్మశ్రీ సుంకర.. తదితరులు ఉన్నారు. వీరు మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి.. గోరంట్ల మాధవ్‌ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచారని ఫిర్యాదు చేశారు. మాధవ్‌ను చట్ట సభల నుంచి బహిష్కరించాలని రాష్ట్రపతి ముర్మును కోరారు.

రాష్ట్రపతితో భేటీ అనంతరం డిగ్నిటీ ఫర్‌ ఉమెన్‌ జేఏసీ మహిళలు మాట్లాడుతూ.. మాధవ్‌ను వైసీపీ ప్రభుత్వం కాపాడుతుందని ఆరోపించారు. ఎంపీపై రాష్ట్ర డీజీపీకి, ఏపీ గవర్నర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాము ఢిల్లీకి రావాల్సి వచ్చామని చెప్పారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి చర్యలు తీసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.