Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరు జిల్లాలో ఘోరం... ఆటో బోల్తాపడి పదిమంది మహిళలకు తీవ్ర గాయాలు

ఉపాధి నిమిత్తం ఓ జీడిపప్పు పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు ఆటో ప్రమాదానికి గురయి హాస్పిటల్ పాలయన దుర్ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

Women Labours injured in auto accident nellore
Author
Nellore, First Published Jun 26, 2022, 9:56 AM IST

నెల్లూరు: మహిళా కార్మికులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడిన ఘటన నెల్లూరులో జిల్లాలో చోటుచేసుకుంది. జీడి పప్పుపరిశ్రమలో పని ముగించుకుని తిరిగివెళుతుండగా ఆటో ప్రమాదానికి గురయి పదిమంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా మునుబోలు మండలానికి చెందిన మహిళలు అక్కంపేటలోని జీడిపప్పు పరిశ్రమలో పనిచేస్తుంటారు. మొత్తం 70మంది మహిళలు ఈ పరిశ్రమలో ఉదయం నుండి రాత్రి వరకు పనిచేస్తుంటారు. రాత్రి 7గంటలకు విధులు ముగించుకుని షేరింగ్ ఆటోల్లో తమ తమ గ్రామాలకు వెళుతుంటారు. 

ఇలా రోజూ మాదిరిగానే నిన్న(శనివారం) పనులకు హాజరైన జట్లకొండూరు, గోవిందరాజపురం, మడమనూరు గ్రామాలకు చెందిన మహిళలు ఒకే ఆటోలో తమతమ గ్రామాలకు బయలుదేరారు. ఇలా రాత్రి సమయంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో గేదె అడ్డురావడంతో ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ఆటో పర్లపాడు క్రాస్ రోడ్ వద్దకు రాగానే గేదెను తప్పించబోగా ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటో డ్రైవర్ తో సహా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. 

ఆటో మూడు నాలుగు పల్టీలు కొట్టడంతో అందులోని మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. లక్ష్మీతేజ, కల్పన, రమ , శ్రీవల్లి, నీరజ, పల్లవి, పావని, అశ్విత, కుమారమ్మ, మునెమ్మ అనే మహిళలు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు, 108 అంబులెన్స్ కు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సమాయక చర్యలు చేపట్టారు. 

తీవ్రంగా గాయపడిన మహిళలను 108 అంబులెన్స్ లో వివిధ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరుతో పాటు ముడమనూరు, మనుబోలు, గూడూరులోని ప్రైవేట్ హాస్పిటల్స్ తో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు ధ్వంసమైన ఆటోను రోడ్డుపై నుండి తొలగించారు. అనంతరం ప్రత్యక్ష సాక్షులు, క్షతగాత్రుల నుండి వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదిలావుంటే పెళ్లయిన కొన్ని గంటలు గంటలు గడవకముందే వరుడు మృతిచెందిన విషాదం నంద్యాల జిల్లా వెలుగోడు మండలం పరిధిలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తుండగా వెలుగోడు మండలంలోని మోత్కూర్ వద్ద  గుర్తుతెలియని వాహనం ఢీకొని కొత్తపెళ్లికొడుకు శివకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతుడి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. 

 వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే శివ కుమార్ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాళ్లకు పారాణి ఆరకముందే భర్తను కోల్పోయిన పెళ్ళికూతురు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది గంటలకే ఇలా జీవిత భాగస్వామిని కోల్పోవడంతో ఆ అమ్మాయి కలలు ఆవిరయ్యారు. కొన్ని గంటల ముందు తన పక్కన పెళ్లిపీటలపై కూర్చున్నవాడు ఇప్పుడు విగతజీవిగా మారి పాడెనెక్కడం ఆ పెళ్ళికూతురు భరించలేకపోతోంది.  

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఘటనాస్థలం నుండి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ఘటనా స్థలానికి దగ్గర్లోని సిసి కెమెరాల రికార్డ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios