పోలీసుల నిఘా ఎక్కువవ్వడంతో దొంగలు రూటు మార్చారు. గతంలో కూరగాయలు అమ్మేవారిలాగానో, బట్టలు అమ్మేవారిలానో పగటి పూట వచ్చి రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత తమ గుట్టు పోలీసులకు తెలిసిపోతుండటంతో వారు వ్యూహాం మార్చారు.

పగటిపూట ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసి డబ్బున్న ఇళ్లని గుర్తుపెట్టుకుని రాత్రికి వచ్చి ఇళ్లంతా గుల్లచేస్తున్నారు. ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ కిలాడి లేడీని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పసుపులేటి లలిత గత కొన్నేళ్లుగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది.

పగటిపూట యాచన చేస్తూ రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడుతుండేది. ఈమెపై నిఘా పెట్టిన పోలీసులు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లలిత వద్ద నుంచి 19 తులాల బంగారం, 86 తులాల వెండితో పాటు రూ.5 లక్షల విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దొంగతనాల్లో లలితతో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.