కర్ణాటక మద్యం అమ్ముతూ పట్టుబడ్డ మహిళా వాలంటీర్... అన్నమయ్య జిల్లాలో ముగ్గురి అరెస్ట్

కర్ణాటక నుండి అక్రమంగా ఏపీకి మద్యం తరలించి అమ్ముకుంటున్న ఇద్దరు వాలంటీర్లు అన్నమయ్య జిల్లాలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. 

Woman volunteer arrest in Annamayya District AKP

కడప : వైసిపి సర్కార్ ఏర్పాటుచేసిన వాలంటీర్ వ్యవస్థ ఇటీవల వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు వాలంటీర్ల తీరు ప్రతిపక్షాల ఆరోపణలు నిజమే అన్న అనుమానాలు కలిగిస్తోంది. తాజాగా ఇద్దరు వాలంటీర్లు కర్ణాటక నుండి ఏపీకి అక్రమంగా మద్యం తరలించి  అమ్ముకుంటూ వాలంటీర్లు పట్టుబడ్డారు. వీరిలో ఓ మహిళా వాలంటీర్ కూడా వుండటం సంచలనంగా మారింది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  పక్కనే వున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మద్యం ధరలు కాస్త తక్కువగా వుండటంతో ఏపీకి చెందిన కొందరు దీన్ని ఆదాయమార్గంగా మార్చుకున్నారు. ఈ రాష్ట్రాల మద్యం అక్రమంగా ఏపీకి తరలించి గుట్టుగా విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా అన్నమయ్య జిల్లాలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో మదనపల్లె స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో రంగంలోకి దిగింది. కురబలకోట అంగళ్లులో తనిఖీలు నిర్వహించగా కర్ణాటక మద్యంతో వాలంటీర్లు పట్టుబడ్డారు. 

అగళ్ళు క్లస్టర్ 19 వాలంటీర్ దాసరి సందీప్ కుమార్ తో పాటు మహిళా వాలంటీర్ లేపాక్షి అమ్మాజిలు కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు సెబ్ అధికారులు గుర్తించారు.  వీరికి కర్ణాటకకు చెందిన నడిపిరెడ్డి సహకరిస్తున్నట్లు తేలింది. ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసిన అధికారులు కర్ణాటక మద్యం, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. 

ప్రజలకు, ప్రభత్వానికి వారధిగా వుండాల్సిన వాలంటీర్లు ఇలా అక్రమంగా మద్యం అమ్ముతూ పట్టుబడటం సంచలనంగా మారింది. స్థానిక వైసిపి నాయకుడి అండదండలతోనే వాలంటీర్లు మద్యం విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇదిలావుంటే గంజాయి కేసులో ఓ వాలంటీర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. జి.మాడుగుల మండలం చింతగరువు గ్రామానికి చెందిన వంతాల వెంకటరావు 2018 లో గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై కేసు నమోదు చేసిన పాడేరు పోలీసులు జైలుకు పంపించారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన అతడు ఇక బుద్దిగా ఉద్యోగం చేసుకోవాలని భావించాడు. ఈ సమయంలోనే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం... గ్రామాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం వాలంటీర్లు నియామకాన్ని చేపట్టింది. దీంతో వెంకటరావు గ్రామ వాలంటీర్ గా చేరిపోయాడు. 

అయితే వాలంటీర్ వెంకటరావు గంజాయి కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. కానీ ఇతడు వాయిదాలకు హాజరుకాకపోవడంతో అతడి బెయిల్ రద్దుచేసి అదుపులోకి తీసుకోవాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పాడేరు ఎస్సై తన సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి చింతగరువుకు వెళ్లి వాలంటీర్ ను అరెస్ట్ చేసారు. వెంకటరావును రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios