విజయవాడలో దారుణం జరిగింది. ఆర్ధిక ఇబ్బందులు తాళలేక గృహిణి,ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. విజయవాడ గ్రామీణం నున్న గ్రామ కోటగట్టు సెంటర్ లో ఘటన జరిగింది.

నున్న కోటగట్టు సెంటర్ లో పగలు చిల్లరకొట్టు వ్యాపారం చేస్తూ, రాత్రి సమయంలో ఆటో నడుపుతూ సురేంద్ర అనే వ్యక్తి జీవనం వెళ్లదీస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు. అయితే ఎంతగా కష్టపడుతున్నా ఆర్థిక ఇబ్బందులు వీరిని వదలడం లేదు.

ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఆటో నడపడం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి విషాదం కళ్లబడింది. భార్య, ఇద్దరు పిల్లల నోటినుంచి నురుగలు కక్కుతూ కొట్టుమిట్టాడుతుండడం కనిపించింది. 

పురుగుల మందు సేవించారని అర్థమైన సురేంద్ర వెంటనే వారిని తన ఆటోలో చికిత్స నిమిత్తం గుంటురు ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ 3 ఏళ్ళ పాప భావన మృతి చెందింది.

భార్య మరో కూతురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేకే భార్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిమీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.