ఆడపిల్ల పుట్టిందని ఓ తల్లిని భర్త దూరంపెట్టడం... అత్తింటివారు ఇంట్లోంచి గెంటివేయడంతో దిక్కుతోచని పరిస్థితిలో బిడ్డతో కలిసి మౌనధీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకు దీక్ష విరమించబోనని ఆ తల్లి చెబుతోంది.
గుంటూరు: ఈ ఆదునాతన కంప్యూటర్ యుగంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ సత్తాచాటి మగవారికి ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు. చివరకు అంతరిక్షపు అంచులను కూడా తాకేస్థాయికి ఆడవాళ్లు చేరుకున్నారు. ఇంతలా మహిళా సాధికారత సాధించినా ఇప్పటికి ఈ సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే వుంది. ఆడపిల్ల పుట్టిందని అమాయక తల్లులను హింసించే సంస్కృతి ఆనాది నుండి ఈ ఆధునిక కాలం వరకు కొనసాగుతూనే వుంది. కడుపులో వున్నది అమ్మాయని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా తుంచివేస్తుండటంతో పాలకులు లింగనిర్దారణ టెస్టులపై నిషేదం విధించారు. ఇలా ఎంత చేసినా ఆడపిల్లలపై వివక్ష ఏమాత్రం తగ్గడంలేదు.
ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులను అత్తింటివారు చిత్రహింసలకు గురిచేస్తున్న అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఇలాగే ఆడపిల్లకు జన్మనిచ్చిన ఓ మహిళను కట్టుకున్నవాడే కాదనుకున్నాడే. కన్న బిడ్డను, కట్టుకున్న భార్యను పుట్టింట్లోనే వదిలిపెట్టాడు. ఎంతకూ భర్త తీరులో మార్పు రాకపోవడంతో ఆ తల్లి బిడ్డతో కలిసి అత్తవారింటి ఎదుట మౌనదీక్షకు దిగింది.
వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడుకు చెందిన నాగాంజలి-వెంకటేశ్వర రావు భార్యాభర్తలు. రెండేళ్లక్రితం వీరి జీవితంలోకి ఓ ఆడపిల్ల వచ్చింది. అయితే మగబిడ్డ కోసం తపించిన వెంకటేశ్వర రావు భార్య ఆడబిడ్డకు జన్మనివ్వడంతో తట్టుకోలేకపోయాడు. దీంతో భార్యతో పాటు ఆడబిడ్డను కూడా పుట్టింట్లోనే వదిలేసాడు.
అయితే కొంతకాలం గడిస్తే భర్త తీరు మార్చుకుని తిరిగి తమను తీసుకువెళతాడని నాగాంజలి భావించింది. కానీ రెండేళ్లు గడుస్తున్నా భర్త తమను తీసుకువెళ్లపోవడంతో ఆమె ఇక లాభం లేదని భావించి ఆందోళన బాటపట్టింది. భర్త ఇంటిఎదుట తమ రెండేళ్ళ కూతురుతో కలిసి ఆ తల్లి మౌన ధీక్షకు దిగింది.
అత్తవారింటికి వెళితే తనతో పాటు కూతురును కూడా అత్తింటివారు బయటకు నెట్టేసారని నాగాంజలి ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లోకి రాకుండా అత్తామామలు తాళం వేయడంతో ఆ ఇంటి ఎదుటే బిడ్డతో కలిసి ఆందోళనకు దిగింది. తమకు న్యాయం చేసి భర్తతో కలపాలని నాగాంజలి కోరుతున్నారు. అప్పటివరకు తాను మౌనదీక్షను కొనసాగిస్తానని తెలిపారు.
