ప్రియుడి మోజులో పడి కన్నకొడుకును అతి దారుణంగా చేయి విరగ్గొట్టి, ఒళ్లంతా వాతలు పెట్టిన దుర్మార్గమైన సంఘటన అనంతపురంలో జరిగింది. వివాహేతర సంబంధం ఎంతటి దారుణాన్నైనా చేయిస్తుందనడానికి ఉదాహరణ ఈ ఘటన. 

వివరాల్లోకి వెడితే.. అనంతపురం జిల్లా హీరేహల్‌లో ఉండే ఓ మహిళకు ఐదేళ్ల కొడుకున్నాడు. ఆమెకు శివ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని కొడుకును చిత్రహింసలు పెట్టేవాళ్లు.

తల్లి, ఆమె ప్రియుడు శివ కలిసి బాలుడి ఒళ్ళంతా వాతలు పెట్టారు. అంతటితో ఆగకుండా చిన్నారి చెయ్యి విరగగొట్టారు. అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టి చిత్రహింసలు పెట్టారు. శివ ఆడుకోవడానికి వస్తాడేమోనని ఇంటికి వచ్చిన తోటి వయసున్న పిల్లలకు విషయం తెలిసింది. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 

పిల్లల ద్వారా బాలుడి పరిస్థితి విన్న గ్రామస్తులు చలించిపోయి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు ప్రియుడు శివను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.