అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కూర్పు దాదాపుగా పూర్తి చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన హోంశాఖను ఎవరిని వరించబోతుందా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. నిన్న మెున్నటి వరకు నగరి ఎమ్మెల్యే రోజా హోంశాఖ మంత్రి అంటూ ప్రచారం జరిగింది. 

ఆ తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ మరోకప్రచారం కూడా జరిగింది. అయితే ఏపీ హోంశాఖ మంత్రి పదవిని మహిళా ఎమ్మెల్యేకే కేటాయించాలని జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 

కేబినెట్ కూర్పు, కీలక పదవుల పంపకాల్లో వైయస్ జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జగన్ అంచనాలను గానీ వ్యూహాలను గానీ పార్టీ ఎమ్మెల్యేలు అంచనా వేయలేకపోతున్నారు. 

ఎవరూ ఊహించని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తూ సంచలన ప్రకటన చేసిన వైయస్ జగన్ తాజాగా రాష్ట్ర హోంమంత్రిగా మహిళకు అవకాశం ఇస్తూ మరోక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 

దీంతో ఆ అదృష్టవంతురాలైన ఎమ్మెల్యే ఎవరంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇకపోతే ఏపీ అసెంబ్లీకి ఈసారి 10 మంది మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వాళ్లు 9 మంది ఉన్నారు. 

గెలుపొందిన వారిలో ఇద్దరు మాత్రమే సీనియర్లు ఉండగా మిగిలిన వారు అంతా నూతనంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలే. వారే ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా. ఇద్దరూ కూడా వైయస్ జగన్ వెన్నంటి నడిచారు. వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీతో విబేధించినప్పటి నుంచి ఆయన వెంటే నడిచారు రోజా. 

అలాగే మేకతోటి సుచరిత సైతం జగన్ వెంటే నడిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు మేకతోటి సుచరిత. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆమె వైయస్ జగన్ వెంట నడిచారు. 

కాంగ్రెస్ పార్టీతో విబేధించి జగన్ వెంట నడిచారు. దీంతో ఆమె అనర్హత వేటుకు గురయ్యారు. అనంతరం జరిగిన 2012 ఉపఎన్నికల్లో కూడా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత మేకతోటి సుచరిత కేవలం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. 

ఇకపోతే రోజా నగరి నియోజకవర్గం నుంచి 2014లో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. మేకతోటి సుచరిత ఓటమి తర్వాత నియోజకవర్గానికి పరిమితమైతే రోజా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి హోదాలో రాష్ట్రమంతటా తిరుగుతూ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు మహిళలపై జరుగుతున్న దారుణాలపై అధికార పార్టీని కడిగిపారేశారు. అటు అసెంబ్లీలోనూ ఇటు బయట అధికార పార్టీకి చుక్కలు చూపించారు రోజా. 

అంతేకాదు కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంలో అసెంబ్లీలో అలుపెరగని పోరాటం చేస్తూ ఏడాదిపాటు అసెంబ్లీ బహిష్కరణకు గురయ్యారు కూడా. అంతేకాదు అమరావతిలో జరిగిన మహిళా సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 

ఇలా పార్టీకోసం అలుపెరగని పోరాటం చేసిన రోజాకే హోంశాఖ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను జగన్ బేరీజు వేసుకుంటే సుచరిత కంటే ఆమెకే మహిళా హోంశాఖ మంత్రిగా అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు దళితులకు హోంశాఖ మంత్రి పదవి ఇచ్చి చరిత్ర సృష్టించాలని జగన్ భావిస్తే కచ్చితంగా మేకతోటి సుచరితకే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు పెద్దఎత్తున మద్దతు ఇవ్వడంతో  ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసేలా మేకతోటి సుచరితకు హోంశాఖ మంత్రి పదవి కట్టబేట్టే ఆలోచన లేకపోలేదని తెలుస్తోంది.

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశానికి హాజరైన రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కష్టాలను వైయస్ జగన్ చూశారంటూ ప్రత్యేకించి గుర్తు చేశారు. తనకు ఎలాంటి పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసునంటూ చెప్పుకొచ్చారు. 

ఈ ధీమా చూస్తుంటే రోజాకే కన్ఫమ్ అయ్యిందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మహిళను ఎంపిక చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పాలి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సైతం మహిళకే హోంశాఖ కట్టబెట్టారు. చేవేళ్ల చెల్లెమ్మ అంటూ ఆప్యాయంగా పిలిచే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ కట్టబెట్టి రికార్డు సృష్టించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. 

నేడు తండ్రిబాటలోనే తనయుడు వైయస్ జగన్ పయనిస్తున్నారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. తన చెల్లెలు రోజమ్మ అంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైయస్ జగన్ అదే చెల్లెమ్మ సెంటిమెంట్ తో రోజాకు కట్టబెడతారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. మరి హోంశాఖ మంత్రి పదవి ఇద్దరిలో ఎవరిని వరిస్తుందో అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.