ఆమెకు పెళ్లై దాదాపు 20 సంవత్సరాలు అవుతోంది. చాలా కాలంపాటు సాఫీగా సాగిన వారి కాపురంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ప్రేమ పేరిట సదరు మహిళకు దగ్గరయ్యాడు. అతని మాయలోపడి భర్త, పిల్లలను పట్టించుకోవడం మానేసింది. విషయం తెలిసిన భర్త ... ఇలాంటివి వద్దు అంటూ భార్యను మందలించాడు. ఆ మాట భార్యకు నచ్చలేదు. వెంటనే ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరసుపేట మండల యాంబరం గ్రామానికి చెందిన సూర్యనారాయణకు 20ఏళ్ల క్రితమే భద్రమ్మ తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా.. రెండు సంవత్సరాల క్రితం సూర్యనారాయణ, భద్రమ్మ దంపతులు నెల్లూరు వచ్చారు. ఓ కూతురికి వివాహం కూడా జరిపించారు. ఈ క్రమంలో భద్రమ్మకు కొంత కాలం క్రితం సుధాకర్ అనే తాపీ మేస్త్రితో పరిచయం ఏర్పడింది.

Also Read ఏపీ స్థానిక ఎన్నికలు: పదో తరగతి పరీక్షలు వాయిదా

ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం కాస్త భర్తకు తెలియడంతో పలుమార్లు మందలించాడు. అయినా కూడా ఆమె మారకపోవడంతో కాస్త గట్టిగా చెప్పాడు. అది నచ్చని భద్రమ్మ భర్త అడ్డు తొలగించుకోవాలని అనుకుంది.

ఈ క్రమంలో ఈ గత నెల 12వ తేదీన పథకం ప్రకారం.. సూర్యానారాయణను పని ఇప్పిస్తానని సుధాకర్ వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ హత్య చేసి శవాన్ని పెట్రోల్ పోసి తగలపెట్టాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే... స్థానికులకు సగం కాలిన శవం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో  చనిపోయింది సూర్యనారాయణ గా గుర్తించారు.

దర్యాప్తులో భాగంగా భద్రమ్మను విచారించగా.. ఆమె పొంతనలేని సమాధానాలు పోలీసులకు అనుమానం కలిగేలా ఉన్నాయి. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా.... హత్య వివరాలు వెలుగులోకి చూశాయి. సుధాకర్, భద్రమ్మలను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.