భర్త చనిపోయాడు... ఒంటరిగా ఇద్దరు పిల్లలతో బతుకు  ఈడుస్తున్న ఆమె జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరికి అతనే ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తొండంగికి గ్రామానికి చెందిన అరుణ(23) భర్త కొన్నాళ్ల క్రితమే మృతి చెందాడు. దీంతో ఇంటిపక్కన ఉండే శ్రీనుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. బతుకు దెరువుకోసం అన్నవరంలోని హరిణి బోటు షికారులో పనిచేస్తోంది. ఈ నెల రెండో తేదీ నుంచి కనబడకపోయేసరికి కుటుంబ సభ్యులు తొండంగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

స్థానికులకు అనుమానం వచ్చి శ్రీనును మంచి మాటలతో అడగడంతో.. అరుణ వేరొకరితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో హత్యచేసినట్లు అంగీకరించాడు. బోటుషికారులో పనిచేస్తున్న అరుణను పని చేస్తున్న దగ్గర్నుంచి బలవంతంగా బయటకు తీసుకుని వచ్చి కొట్టాడు. ఆపై నదిలోకి తోసి చంపేశాడు. శ్రీనుకు ఇంతకు ముందే వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. చంపిన ప్రదేశానికి తీసుకుని వచ్చి జరిగినదంతా చెప్పడంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు. తొండంగి స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.