ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యయత్నం చేసింది. తొలుత పిల్లలను బావిలోకి తోసిన తల్లి.. తర్వాత ఆమె కూడా బావిలోకి దూకింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యయత్నం చేసింది. తొలుత పిల్లలను బావిలోకి తోసిన తల్లి.. తర్వాత ఆమె కూడా బావిలోకి దూకింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతిచెందగా, తల్లిని స్థానికులు కాపాడారు. వివరాలు.. జిల్లాలోని రోలుగుంట మండలం జగ్గంపేట నాయుడుపాలెం గ్రామానికి చెందిన నాగరాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఆరేళ్ల క్రితం సాయితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు 5 ఏళ్ల భాను, 3 ఏళ్ల పృద్వీ ఉన్నారు. 

నాగరాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. సాయి పిల్లలతో కలిసి ఇంటి వద్దే ఉంటూ బాగోగులు చూసుకుంటుంది. అయితే గత కొంతకాలంగా వారి కుటుంబంలో మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. డబ్బుల కోసం చెలరేగిన వివాదంతో మనస్తాపం చెందిన సాయి.. ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకేసింది. ఈ ఘటనలో పిల్లలు మృతిచెందగా.. సాయిని స్థానికులు రక్షించారు. ఈ ఘటనపై సమాచారం అందుకన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు సహాయంతో పిల్లల మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. విచారణ చేపట్టారు. 

(Disclamir: ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదు. సంక్షోభం వంటి పరిస్థితులు ఎదురైతే, అలాంటి భావన కలిగితే.. మీరు కౌన్సెలింగ్ మద్దతు కోసం 9152987821, 9820466726, 7893078930 (హైదరాబాద్ వన్‌లైఫ్) కు కాల్ చేయవచ్చు. ఈ నెంబర్‌లు పూర్తిగా పబ్లిక్ డొమైన్‌ నుంచి సేకరించబడినవి.. వీటిని Asianet Telugu ధ్రువీకరించలేదు)