నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి: తల్లీ బిడ్డ క్షేమం
నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో ఓ గర్భిణీ మగబిడ్డకు జన్మనిచ్చింది. నెల్లూరు నుండి మంచిర్యాల వెళ్తున్న సమయంలో రైలులోనే గర్భిణీ మగబిడ్డకు జన్మనిచ్చింది.
విజయవాడ: ఓ గర్బిణీ రైలులోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఓ కుటుంబం తెలంగాణలోని మంచిర్యాలకు నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో వెళ్తుంది. వీరిలో ఓ గర్భిణీ కూడా ఉంది. ఆమెకు నెలలు నిండాయి. ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయడం కోసం గర్భిణీని కూడా తప్పనిసరిగా తీసుకెళ్తున్నారు కుటుంబ సభ్యులు . అయితే ఆదివారం నాడు నవజీవన్ ఎక్స్ ప్రెస్ విజయవాడ కృష్ణకెనాల్ వద్దకు చేరుకోగానే పురుటినొప్పులు వచ్చాయి. రైలులోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. రైల్వే అధికారుల సహాయంతో గర్భిణీని విజయవాడ రైల్వే స్టేషన్ లో దించేశారు. విజయవాడలోని ఆసుపత్రిలో చేర్పించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్టుగా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
గతంలో కూడా దేశంలోని పలు చోట్ల రైలులో ప్రయాణీస్తున్న సమయంలో పలువురు ప్రసవించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మార్చి మాసంలో వెస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో గర్భిణీ బిడ్డకు జన్మనిచ్చింది. జనరల్ కోచ్ లో కుటుంబంతో వెళ్తున్న సమయంలో రన్నింగ్ ట్రైన్ లో భారతి అనే మహిళా బిడ్డకు జన్మనిచ్చింది. పొందనూరు జంక్షన్ నుండి మంగళూరుకు వెస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర నుండి ఉపాధి కోసం కోయంబత్తూరుకు ఈ కుటుంబం వలస వెళ్లింది.
2020 జూన్ 25న ఇదే తరహ ఘటన ఒకటి చోటు చేసుకుంది. పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ రైలులో సోనీ దేవీ అనే మహిళ రైలులోనే బిడ్డకు జన్మనిచ్చింది. తన స్వగ్రామం పాట్నాకు వెళ్తున్న సమయంలో రైలులోనే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. రైలులోనే పురిటినొప్పులు రావడంతో ఆమెకు అదే బోగీలో ఉన్న తోటి ప్రయాణీకులు సహయం చేశారు.2016 అక్టోబర్ లో రైలులో ప్రయాణీస్తున్న మాయాదేవి అనే మహిళ కూడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు రైలులో ప్రయాణీస్తున్న తోటి ప్రయాణీకులు సహాయం చేశారు. శ్రమజీవి ఎక్స్ ప్రెస్ రైలులో సింపి అనే మహిళ 2021 నవంబర్ 21న బిడ్డకు జన్మనిచ్చింది. రైలులోని టాయిలెట్ లో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. నెలలు నిండకముందే ఆమెకు బిడ్డ పుట్టాడు. రైలులో ప్రయాణీస్తున్న సమయంలో ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో రైలులో ఉన్న మహిళా ప్రయాణీకులు ఆమెకు సహాయం చేశారు. దీంతో బిడ్డకు జన్మనిచ్చింది. రైలు మొరాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోగానే ఆమెను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.