కట్టుకున్న భర్తే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. ఎవరైనా భార్య జోలికి వచ్చినా... ఆమెను బెదిరించి.. ఇబ్బంది పెట్టాలని చూసినా కాపాడాల్సిందిపోయి... తానే ఆమెను రకరకాలుగా వేధించడం మొదలుపెట్టాడు. ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీసి... వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా శ్రీనివాసరావుపేటకు చెందిన దంపతులు తమ పెద్ద కుమార్తెను తాడికొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. కాగా.. పెళ్లైన కొద్ది రోజులు భార్యతో ప్రేమగా ఉన్న వ్యక్తి తర్వాతర్వాత తనలోని రాక్షసుడిని నిద్రలేపాడు. అదనపు కట్నం కావాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

అదనపు కట్నం ఇవ్వడానికి ఆమె అంగీకరిచకపోవడంతో.. బ్లాక్ మెయిల్ కి దిగాడు. భార్య స్నానం చేస్తున్న క్రమంలో రహస్యంగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియో చూపించి.. అదనంగా కట్నం తేకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అతని వేధింపులు రోజూ తీవ్రతరం కావడంతో... సదరు మహిళ తన తల్లి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.