వైఎస్ జగన్ ఇంటి సమీపంలోని అపార్టుమెంటులో మహిళ మృతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి సమీపంలో గల ఓ అపార్టుమెంటులో కరోనా వైరస్ వ్యాధితో ఓ మహిళ మరణించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో శానిటైజ్ చేపట్టారు.
అమరావతి: కరోనా వైరస్ వ్యాధితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ముగ్గురు మరణించారు. వారిలో కర్నూలుకు చెందిన ఇద్దరు మగవాళ్లు, గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి చెందిన ఓ మహిళ ఉన్నారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి కిలోమీటర్ దూరంలో గల ఓ అపార్టుమెంటులో నివసించే 60 ఏళ్ల మహిళ శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో ఈ నెల 14వ తేదీన విజయవాడ సర్వజనాస్పత్రిలో చేరారు.
అక్కడ ఆ మహిళ చికిత్స పొందుతూ ఈ నెల 15వ తేదీన మరణించింది. ఆమెకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ ఉన్నట్లు శుక్రవారం తేలింది. విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లే మార్గంలో కనకదురగ్ వారిధి దాటిన తర్వాత సర్వీసు రోడ్డులో టోల్ గేట్ చౌరస్తా ఉంది. ఆ చౌరస్తాకు దగ్గరలో ఉన్న అపార్టుమెంటులో నివసిస్తున్న 60 ఏళ్ల మహిళ మహిళ కరోనా వైరస్ తో మరణించింది. ఆ సమాచారం అందడంతో గుంటూరు జిల్లా యంత్రాంగం శనివారం అప్రమత్తమైంది.
ఆ మహిళ నివసిస్తున్న అపార్టుమెంటు తాడేపల్లి చౌరస్తా నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లే ప్రధాన మార్గం పక్కనే ఉంది. అపార్టుమెంటులో 78 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ మహిళ భర్త, కుమారుడు, కోడళ్లతో కలిసి ఉంటోంది. కుమారుడు మంగళగిరి దగ్గరలో గల ఓ ఆస్పత్రిలో కంప్యూటర్ ఆపరేటర్. కోడలు ప్రస్తుతం హైదరాబాదులో ఉంది.
మహిళ కరోనా వైరస్ తో మరణించినట్లు తేలడంతో అధికారులు శానిటైజ్ కార్యక్రమం చేపట్టారు. ఆమెకు ఎవరి ద్వారా కరోనా వచ్చిందో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అపార్టుమెంటులో అందరూ హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు.
ఇదిలావుంటే, కర్నూలు పాత పట్టణానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించాడు. బుధవారపేటకు చెందిన మరో 60 ఏళ్ల వ్యక్తి శనివారం మరణించాడు. దీంతో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ తో నలుగురు మరణించినట్లు తేలింది. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరుకుంది.