ఇంతకాలం కలిసి జీవించిన భర్త మృతిచెందడాన్ని భరించలేక, చివరకు ఇంట్లోకి కూడా వెళ్లడం ఇష్టంలేక ఓ మహిళ గేటుకే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గుంటూరు: వివాహ బంధంతో ఒక్కటైన ఆ దంపతులు ఇప్పటివరకూ ఒకరిని విడిచి ఒకరు వుండలేదు. సంతానం లేకపోయినా ఒకరినొకరు సంతానంగా భావించి ఆనందంగా జీవించారు. వృద్దాప్యంలో కూడా ఒకరినొకరు విడిచి వుండలేకపోయారు. చివరకు అనారోగ్యంతో భర్త దూరమవగా... భరించలేకపోయిన భార్య కూడా ఇంటిబయటే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచూసుకుంది. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు పట్టణంలోని కన్నావారి తోటలో మణుగూరి వెంకటరమణారావు(68), సువర్ణ రంగలక్ష్మి(65) దంపతులు జీవించేవారు. వీరికి సంతానం కలగకపోయినా ఇంతకాలం భార్యాభర్తలిద్దరు ఆనందంగా జీవించారు. అయితే వృద్దాప్యంలో పిల్లలు లేని లోటు వారికి తెలిసింది. వయసు మీదపడటంతో ఏ పనీ చేయలేక ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు. అంతేకాదు రమణారావు అనారోగ్యం పాలవగా హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు వీరివద్ద డబ్బులు లేవు. దీంతో అతడికి ప్రభుత్వాస్పత్రికి చేర్పించింది భార్య రంగలక్ష్మి. 

రెండురోజుల క్రితం హాస్పిటల్ లో చేరిన రమణారావు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో నిన్న(బుధవారం) మృతిచెందాడు. భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికే కాదు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఆ వృద్దురాలి వద్ద డబ్బులు లేవు. ఓవైపు ఈ నిస్సహాయ స్థితి, మరో వైపు భర్తను కోల్పోయిన పుట్టెడు ధు:ఖాన్ని భరించలేక హాస్పిటల్ లోనే ఆమె ఆత్మహత్యకు యత్నించింది. అయితే హాస్పిటల్ సిబ్బంది ఆమెను కాపాడి ఆమె భర్త అంత్యక్రియల కోసం ఓ స్వచ్చంద సంస్థ సహాయం కోరారు. 

హాస్పిటల్ సిబ్బంది సమాచారంలో రుద్రా ఛారిటబుల్‌ ట్రస్టు రమణారావు అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చిది. ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు సుభానీ హాస్పిటల్ కు చేరుకుని రమణారావు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. భర్తను కోల్పోయి దిక్కులేని స్థితిలో వున్న రంగలక్ష్మికి కూడా ఆశ్రయం కల్పించడానికి సుభానీ ముందుకువచ్చాడు. అనాధాశ్రమంలో చేర్చించి బాగోగులు చూసుకుంటామని ట్రస్ట్ సభ్యులు ఆమెకు భరోసా ఇచ్చారు.

అయితే రమణారావు అంత్యక్రియలు అర్ధరాత్రి పూర్తవడంతో ఈ ఒక్కరాత్రి ఇంటికి వెళ్లాలని... తెల్లవారాక వచ్చి అనాధాశ్రమానికి తీసుకుని వెళతామని చెప్పి రాత్రి 3గంటల సమయంలో రంగలక్ష్మిని ఇంటివద్ద వదిలిపెట్టారు. అయితే భర్త లేకుండా ఒంటరిగా జీవించాలేనని భావించిన ఆమె దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లోకి కూడా వెళ్లకుండా కట్టుకున్న చీరతో గేట్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఇది గమనించిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. 

రంగలక్ష్మి మరణవార్త తెలిసి రుద్రా ట్రస్ట్ సభ్యులు పోస్ట్ మార్టం అనంతరం ఆమె అంత్యక్రియలను కూడా జరిపారు. భర్త చితి పక్కనే ఆమె దహనసంస్కారం కూడా జరిపారు. ఇలా ఇంతకాలం కలిసి జీవించిన భార్యాభర్తలు చివరకు చితిమంటల్లో కాలి బూడిదగా ఒక్కటయ్యారు. 

మృతురాలి సోదరుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిల్లలు లేకపోవడం, ఇప్పుడు భర్త కూడా మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురయిన తన సోదరి ఈ బ్రతుకు మరింత భారం కాకముందే చనిపోవాలని భావించి ఆత్మహత్య చేసుకుని వుంటుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు.