విజయవాడ: ప్రేమించి పెళ్లి చేసుకోవాలని యువతిని ఓ వ్యక్తి కత్తితో బెదిరించాడు.ఈ విషయమై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ గవర్నర్ పేట -1 డిపోలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఓ యువతి విధులు నిర్వహిస్తోంది. అదే బస్ డిపోలో మెకానిక్ గా అజయ్ కుమార్ పనిచేస్తున్నాడు. ఒకే డిపోలో పనిచేస్తున్నందున ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని అజయ్ భావించాడు.

ప్రేమ పేరుతో ఆమెను వేధించాడని  బాధితురాలు ఆరోపిస్తోంది. ఇటీవలనే ఆ యువతికి వేరే యువకుడితో వివాహం నిశ్చయమైంది.ఈ విషయం తెలిసిన అజయ్ కుమార్ బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో బెదిరించాడు. తననే పెళ్లి చేసుకోవాలని  హెచ్చరించాడు.  తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడని బాధితురాలు ఆరోపించారు.

ఈ విషయమై ఆమె సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.