ఇచ్చాపురంలో విషాదం చోటు చేసుకుంది.  రైలు నిలయం సమీపంలో బుధవారం ఉదయం ఓ రైలు ఢీకొని తులసి తనూజ(19) అలియాస్ గాయత్రి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 

పట్టణంలోని నీలాపు వీధిలో గాయత్రి  తల్లిదండ్రులు, చెల్లెళ్లతో కలిసి ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది రోజూ మేడపై గదిలో గాయత్రి, చెల్లెళ్లు ఇద్దరితో కలిసి పడుకుంటారు. అలా మంగళవారం రాత్రి అక్కడే పడుకున్న వారి లో అర్ధరాత్రి దాటిన తర్వాత గాయత్రీ కనిపించలేదు.

కాసేపటికి మెళుకువ వచ్చిన కుటుంబ సభ్యులు విషయం గ్రహించి, వెతకడం మొదలు పెట్టారు. వీరు ఇలా ఆందోళన చెందుతూ ఉండగా ఎల్ సి గేట్ వద్ద ఓ యువతి మృతదేహం ఉందన్న విషయం తెలిసింది.

అక్కడికి వెళ్లి చూడగా అది గాయత్రి మృతదేహమే. దీంతోతల్లిదండ్రులు, చెల్లెళ్లు బోరు మన్నార. మృతదేహాన్ని శవ పంచనామా కు ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇటీవల గాయత్రికి ఓ పెళ్లి సంబంధం కుదిరిందని బంధువులు తెలిపారు.

ఇరువైపులా ఇష్టపడటంతో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే కట్నం వద్ద పేచీ వచ్చిందని, వారు అడిగినంత కట్నం ఇవ్వలేక వేరే సంబంధం చూడాలని గాయత్రి తల్లిదండ్రులు భావించారు. 

దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైందని బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె చావుకు ఇదేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా.. అని పోలీసుల విచారణ చేస్తున్నారు. ఏ విషయం శవ పంచనామాలో తెలియనుంది. దీనిపై పలాస జిఆర్పి ఎస్ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.