భర్త కుటుంబ పోషణను ఎప్పుడో గాలికి వదిలేశాడు. తినడం, తాగడం తప్ప మరో ధ్యాస లేదు. దీంతో.. కుటుంబ భారాన్ని తనపై వేసుకుంది. తన శాయశక్తులా కష్టపడి కుటుంబాన్నినెట్టుకొస్తోంది. అలాంటి తనకు సహకరించకపోగా.. తాగి భర్త హింసించడం మొదలుపెట్టాడు. బిడ్డల ముఖం చూసి కొంతకాలంగా వాటిని భరిస్తూ వచ్చింది. కానీ.. రోజు రోజుకీ ఆ వేధింపులు ఎక్కువ కావడంతో ఇక భరించడం ఆమె వల్ల కాలేదు. దీంతో బిడ్డలను బావిలో పడేసి.. ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన చిత్తూరులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పంచాయతీ పరిధిలోని చిన్నతయ్యూరు హరిజనవాడకు చెందిన సుధాకర్‌ అలియాస్‌ చిన్నబ్బ(37)కు పదేళ్ల క్రితం మేనమామ కూతురైన కార్వేటినగరం మండలం పాదిరికుప్పానికి చెందిన సింధుప్రియ(25)తో వివాహం జరిగింది. వీరికి మధు(7), శ్రీలత(5) అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. తాగుడుకు బానిసైన సుధాకర్‌ జులాయిగా తిరిగేవాడు.

 దీంతో సింధుప్రియ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో సోమవారం కూడా ఉపాధి హామీ పనికి వెళ్లి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో గొడవ పడిన సుధాకర్‌ తన భార్యను కొట్టాడు. ఇరుగుపొరుగు సర్దబోతే వారితో కూడా వాదనకు దిగాడు. ఇంతకాలం భర్తను భరిస్తూ వచ్చిన సింధుప్రియ భర్త తీరు చూసి విసిగిపోయింది.

తమ జీవితాలు బాగుపడే అవకాశం ఏమాత్రం లేవని తీర్మానించుకుంది. భర్త వేధింపులు తాళలేక బిడ్డలతో కలసి చనిపోతున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టింది. ఇద్దరు బిడ్డలను తీసుకుని చిన్నతయ్యూరు సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వారిని బావిలో తోసేసింది. ఆ తర్వాత తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. వారిని వెతుక్కుంటూ సుధాకర్‌ ఆ బావి వద్దకు వెళ్లాడు. 

అప్పటికే ఓ బిడ్డ, భార్య శవాలై బావిలో తేలడం గమనించాడు. వారు లేని బతుకెందుకనుకున్నాడో ఏమో ఆ బావి పక్కనే ఉన్న చెట్టుకు టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపు వెళ్ళిన ఓ మహిళ సుధాకర్‌ శవాన్ని చూసి కేకలు వేయడంతో మొత్తం విషయం వెలుగుచూసింది.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.