ఓ మహిళ తాను బలవన్మరణానికి పాల్పడాలని అనుకుంది. తాను చనిపోతే బిడ్డలు అనాథలు అయిపోతారని అనుకుంది. వెంటనే తన ఇద్దరు పిల్లల ఒంటికి శానిటైజర్ రాసి.. ఆ తర్వాత తాను కూడా రాసుకుంది. ఒంటికి నిప్పు అంటించుకుందామని ప్రయత్నించగా... ఒకరు అగ్నికి ఆహుతయ్యారు. మరొకరు మాత్రం తప్పించుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరుకు చెందిన కొండ్రెడ్డి సుబ్బులుకు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలానికి చెందిన కొండ్రెడ్డి బాబుతో 11ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు మహేశ్ బాబు(6), కుమార్తె మధురవాణి(4) ఉన్నారు.

భర్తతో గొడవ పడిన సుబ్బులు.. చనిపోవాలని అనుకుంది.దీంతో.. పిల్లలు ఇద్దరినీ తీసుకొని అమ్మమ్మ ఇంటికి వెళదామని చెప్పి.. స్మశానికి తీసుకెళ్లింది. పిల్లల కళ్లకు గంతలు కట్టి.. ఒంటి నిండా శానిటైజర్ పూసింది. ఆ తర్వాత అరవకుండా నోటిలో దుస్తులు కుక్కింది. ముందుగా తనకు తాను నిప్పటించుకుంది. 

ఆ వెంటనే తనను పట్టుకుని ఉన్న నాలుగేళ్ల కుమార్తెకూ అంటించింది. ఇంతలో శానిటైజర్‌ ప్రభావానికి కళ్లు మంటపుట్టడంతో మహేశ్‌ కళ్లకు ఉన్న గంతలు తీశాడు. మంటలు అంటుకుని విలవిల్లాడుతున్న చెల్లిని, తల్లిని చూసి పెద్దగా ఏడుస్తూ రోడ్డుపైకి పరిగెత్తాడు. అటుగా పనికి వెళుతున్న కూలీలు చూసి ఆ బిడ్డతో సహా ఘటనా స్థలికి రాగా కాలుతున్న శరీరాలు కనిపించాయి. అమ్మ, చెల్లెలు చనిపోయారని మహేశ్‌ ఏడుస్తూ తన తండ్రికి ఫోన్‌లో చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.