అతనికి అప్పటికే పెళ్లి అయ్యింది. ఆ విషయం తెలిసి కూడా వివాహితుడితో ఓ యువతి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం కాస్త యువతి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో... ఆమె తల్లిదండ్రులు యువతిని మందలించారు. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాగంబొట్లపాలేనికి చెందిన ఓ ముస్లిం యువతి బాపట్ల మదర్సాలో ఇంటర్‌ చదువుతోంది.  కరోనా కారణంగా సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దనే ఉంటూ ఓ వివాహితుడితో సాన్నిహిత్యంగా మెలుగుతోంది. ఇది గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు. ఆ యువతి తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టి ఈ నెల 19న అలిగి చీమకుర్తి వెళ్లింది. 

అక్కడ నుంచి వివాహితుడికి ఫోన్‌ చేసి తనను తీసుకువెళ్లాలని, లేకుంటే చనిపోతానని బెదిరించింది. దీంతో ఆ వ్యక్తి చీమకుర్తికి వెళ్లాడు. యువతికి నచ్చజెప్పి ఆమె సోదరి గ్రామమైన రజానగరంలో వదిలి పెట్టేందుకు తీసుకువెళ్లాడు. ఇది గమనించిన ఆ యు వతి కుటుంబీకులు ఆందోళనతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారిని స్టేషను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించి వేశారు. తరువాత యువతిని బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు కట్టడి చేశారు. మనస్తాపానికి గురైన యువతి  ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేసేందుకు సన్నద్ధం కాగా గ్రామ మహిళా పోలీస్‌ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.  మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తల్లిదండ్రులే కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.