హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటర్నేషనల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారంటైన్ సెంటర్ లో మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉందూరు గ్రామానికి చెందిన నాగరాజు భార్య మంగ (28) ఉపాధి కోసం మస్కట్ వెళ్లింది. ఈ నెల 4వ తేదీన ఆమె మస్కట్ నుంచి తిరిగి వచ్చింది. కోవిడ్ నిబంధనల మేరకు ఆమె క్వారంటైన్ సెంటర్ లో ఉంది. ఆమెతో పాటు అదే గదిలో మరో రాష్ట్రానికి చెందిన యువతి కూడా ఉంది.

శుక్రవారం సాయంత్రం మంగ తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండడంతో యువతి మరో గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి మంగ ఉరేసుకుని ఉంది. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.