పెళ్లి చేసుకోవాలంటూ అక్క మరిది వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ పట్నంలో కలకలం రేపింది. విశాఖ జీవీఎంసీ 4వ వార్డు గంగడపాలెంలో వాసుపల్లి లావణ్య అనే యువతి పెళ్లి వేధింపులు తట్టుకోలేక బలవన్మరణం పొందింది. 

లావణ్య, అరుణ ఇద్దరు అక్కాచెల్లెళ్లు. వీరికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఇదే ప్రాంతంలో ఉండే  పిన్ని ముకర కనక, గురునాథ్‌ల వద్ద ఉంటున్నారు. కొద్ది రోజుల కిందట లావణ్య అక్క అరుణకు ఫిషింగ్‌ హార్బర్‌లో ఉండే రాముతో వివాహమైంది. 

రాముకు మురళి అనే తమ్ముడున్నాడు. పెళ్లైన తరువాతి నుండి మురళి, లావణ్య వెంటపడుతున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా మురళి వేధింపులు తప్పకపోవడంతో తట్టుకోలేక శనివారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న తరువాత ఇంటికి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకుని లావణ్య ఆత్మహత్య చేసుకుంది. 

లావణ్య తగరపువలసలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.