ఇద్దరు బిడ్డలను చంపేసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మండలంలోని తుమ్మలచెరువు గ్రా మానికి చెందిన గన్నారపు రంగారెడ్డి కుమార్తె రాధికకు వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన లచ్చిరెడ్డితో 2013లో వివాహమైంది. 

వ్యాపారం కోసం లచ్చిరెడ్డి, ఆయన సోదరుడు నారాయణరెడ్డి కుటుంబాలు కలిసి హైదరాబాద్‌లోని కేబీసీ కాలనీలో జీవనం సాగిస్తున్నాయి. అయితే  ఏప్రిల్‌ 14న నారాయణరెడ్డి, హర్షితల కుమార్తె లిసిక (3) మరుగుదొడ్లు శుభ్రం చేసే  ద్రావణం తాగి మరణించింది. కానీ లిసిక మరణానికి  రాధిక కారణం అంటూ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి.

ఆ పసిబిడ్డ మరణానికి తనని కారణం చేస్తూ అందరూ తిట్టడాన్ని రాధిక భరించలేకపోయింది. అందరూ వేస్తున్న నిందలను భర్త లచ్చిరెడ్డి కూడా నమ్మడంతో ఆమె మరింత కుంగిపోయింది. ఈ క్రమంలో లచ్చి రెడ్డి.. భార్య రాధిక, ఇద్దరు పిల్లలను తీసుకువచ్చి ఆమె పుట్టింట్లో దింపేసి వెళ్లిపోయాడు.

కాగా.. అప్పటికే నిందలతో కుంగిపోయిన రాధిక వాటిని భరించలేక చనిపోవాలని నిశ్చయించుకుంది. తన ఇద్దరు పిల్లలు కృషిదీప్‌రెడ్డి (4), రిషిక (13 నెలలు)లను దిండుతో అదిమిపెట్టి చంపి తాను ఉరివేసుకొని మృతి చెందింది. రేషన్‌ తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆమె తల్లి ఇంటికొచ్చి చూసేసరికి కుమార్తె ఉరివేసుకొని కనిపించింది. హర్షితకు చెప్పండి... నేను ఎలాంటి తప్పూ చేయలేదు నాన్నా.. అంటూ తన మరణానికి కారణం తెలియజేస్తూ రాసిన లేఖ ఆమె మృతదేహం వద్ద గుర్తించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందలు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు.