నిత్య పెళ్లికూతురు: ముగ్గురితో పెళ్లి, డబ్బులు గుంజి పరార్
ఏపీలోని తిరుపతిలో ఓ నిత్య పెళ్లికూతురి వ్యవహారం వెలుగు చూసింది. ఏ యువతి తిరుపతిలో నివాసం ఉంటున్న యువకుడిని మూడో పెళ్లి చేసుకుని, అతన్ని మోసం చేసి పరారైంది.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిత్య పెళ్లికూతురు వ్యవహారం వెలుగు చూసింది. తాను అనాథనని నమ్మించి ఓ యువతి ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇది మూడో పెళ్లి. అది వరకే ఇద్దరిని పెళ్లి చేసుకుందనే విషయం తెలియక అతను ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమె లక్షల రూపాయలు దండుకుని ఉడాయించింది.
ఆ తర్వాత మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాలోని విజయపురం మండలానికి చెందిన యువకుడు (20) ఐదేళ్లుగా మార్కెటింగ్ ఉద్యోగం చేస్తూ తిరుపతిలోని సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నాడు.
తిరుపతిలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే ఎం. సుహాసిని (3)తో అతనికి పరిచయం కలిగింది. అది కాస్తా ప్రేమగా మారింది. తాను అనాథనని సుహాసిని యువకుడికి చెప్పింది. దాంతో అతను తన కుటుంబ సభ్యులను ఒప్పించి నిరుడు డిసెంబర్ లో వివాహం చేసుకున్నాడు.
ఆ సమయంలో ఆమెకు 8 తులాల బంగారం పెట్టారు తనను చిన్ననాటి నుంచి ఆదరించినవారికి ఆరోగ్యం బాగాలేదని, పెల్లికి ముందు అప్పులు చేశానని ఆమె యువకుడికి చెప్పి వివిధ రూపాల్లో రూ. 4 లక్షలు తీసుకుంది. దానికితోడు అతని తండ్రి నుంచి మరో రూ.2 లక్షలు తీసుకుంది.
అది తెలియడంతో యువకుడు సుహాసినిని నిలదీశాడు. దాంతో ఈ నెల 7వ తేదీన ఇరువురికి మధ్య గొడవ జరిగింది. మర్నాడు సుహాసిని కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా అతనికి ఇంట్లో ఆమె ఆధార్ కార్డు లభించింది. దాని ఆధారంగా ఆరా తీయగా నెల్లూరు జిల్ాల కోనేటిరాజపాళేనికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహమై ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలిసింది.
ఇంతలో ఆ యువతి యువకుడికి ఫోన్ చేసింది. తాను హైదరాబాదులో ఉన్నానని, త్వరలో డబ్బులు ఇచ్చేస్తానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే చిక్కుల్లో పడుతావని చెప్పింది. ఏడాదిన్నర క్రితం రెండో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఫొటోలను కూడా పంపించింది. దీంతో యువకుడు తిరుపతిలోని అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు.