పిల్లల కోసం దగ్గరికెళ్లిన భర్తను పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం అన్నమయ్య జిల్లాలో వెలుగుచూసింది.
మదనపల్లె :గతంలో కుటుంబ బంధాలు చాలా బలంగా వుండేవి. కానీ నేడు ఆ బంధాలకు విలువే లేకుండా పోయింది. ఇప్పటికే ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవగా ప్రస్తుతం భార్యాభర్తలు కూడా కలిసుండలేని పరిస్థితి దాపురించింది. చిన్న చిన్న కారణాలతో జీవితాంతం కలిస్తుండాల్సిన భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్న అనేక ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఓ భార్య భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన బావాజీ(33), యాస్మిన్ కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదిరించి మరీ పెళ్ళిచేసుకున్నారు. కొన్నేళ్లు వీరి సంసారం సాఫీగానే సాగడంతో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇలా పిల్లాపాపలతో జీవితం హాయిగా సాగుతుండగా భార్యాభర్తల ప్రేమ తగ్గి కలహాలు పెరిగిపోయాయి. రోజురోజుకు ఇద్దరిమధ్య దూరం పెరిగి చివరకు విడిపోయే స్థాయికి చేరుకుంది.
భర్త బావాజీకి దూరమైన యాస్మిన్ పిల్లలతో కలిసి పుట్టింట్లో వుంటోంది. పిల్లల కోసమైనా కలిసుండకుండా భార్యాభర్తలు విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యారు. పదిరోజుల క్రితమే వీరికి విడాకులు కూడా లభించడంతో చట్టప్రకారం భార్యభర్తలిద్దరూ దూరమయ్యారు.
Read More తండ్రి తాగొచ్చి తల్లిని రోజూ కొడుతున్నాడని ఎస్సైకి ఫిర్యాదు చేసిన తొమ్మిదేళ్ల బాలుడు.. ఎక్కడంటే ?
అయితే భార్య దగ్గరున్న పిల్లలను మరిచిపోలేకపోయిన బావాజీ తల్లడిల్లిపోయాడు. దీంతో గురువారం రాత్రి అతడు పిల్లలకోసం భార్య పుట్టింటికి వెళ్లాడు. కానీ అతడిని ఇంట్లోకి రానివ్వకుండా, పిల్లలను చూడనివ్వకుండా యాస్మిన్ కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో గొడవ పెద్దది కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన యాస్మిన్ కుటుంబసభ్యులతో కలిసి భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటల్లో కాలిపోతున్న బావాజీ ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల ఇళ్లవారు వచ్చి కాపాడారు. అప్పటికే 90శాతం కాలిపోయిన బావాజీ కొనఊపిరితో వుండగా 108 అంబులెన్స్ లో స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ కు వెళ్లి బావాజీ నుండి వివరాలు సేకరించారు. అనంతరం ఘటన జరిగిన డ్రైవర్స్ కాలనీ వాసులను, యాస్మిన్ కుటుంబసభ్యులను విచారించారు. కేసు నమోదు చేసి బావాజీపై హత్యాయత్నానికి పాల్పడినవారిపై చర్యలకు సిద్దమైనట్లు మదనపల్లె పోలీసులు తెలిపారు.
