ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ.. మోసాలకు పాల్పడుతున్న ఓ మహిళను, ఆమెకు సహకరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సిరిసిల్లా : ముదిమి వయసులో రెండో పెళ్లి కోసం ఎదురుచూసే పురుషులనే టార్గెట్గా చేసుకొని ఓ మహిళ పెళ్లి మీద పెళ్లి చేసుకుంటున్న వైనం సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెలుగు చూసింది. ఈ నిత్య పెళ్లి కూతురితోపాటు ఆమెకు సహకరిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. వీరి మోసాలు బయటపెట్టింది ఆమె ద్వారా మోసపోయిన ఆమె భర్తల్లో ఒకడే. పుట్టింటికి వెళ్తానని చెప్పిన భార్య తిరిగి రాకపోవడంతో వెతికిన ఆ భర్త.. భార్య తనను కాక తనకంటే ముందు.. ఆ తరువాత ఎంతోమందిని పెళ్లాడిందని తెలిసి గుండెలు పగిలి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి భార్య 20 ఏళ్ల క్రితం చనిపోయింది. అతను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీనికోసం ఆరా తీయగా.. రెండో పెళ్లిళ్లు చేయడంలో కర్ణాటక కు చెందిన శివకుమార్ చేయితిరిగిన వ్యక్తి అని తెలిసింది. వెంటనే అతడిని సంప్రదించాడు..అతను కూడా లక్ష్మణ్ కోరికను నెరవేరిస్తానని హామీ ఇచ్చాడు. కాకపోతే తనకు మూడు లక్షల రూపాయలు ఫీజు ఇవ్వాలని అడిగాడు.అలా శివకుమార్ కు మూడు లక్షలు ఇచ్చి.. అతను కుదిర్చిన మహిళతో ఎనిమిది నెలల క్రితం లక్ష్మణ్ పెళ్లి చేసుకున్నాడు.

యువతుల పేరుతో టెలిగ్రామ్ లో వల: హైద్రాబాద్‌లో కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

పెళ్లయిన కొద్ది రోజుల తర్వాత ఆ మహిళ పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది. తిరిగి రాలేదు. జగిత్యాల జిల్లాలోని మరో వ్యక్తికి అదే మహిళతో శివకుమార్ మళ్లీ పెళ్లి చేయించాడు. అక్కడా ఇదే సీన్ రిపీట్ అయింది. పెళ్లయిన మూడు నెలలకు తల్లిగారింటికి వెళ్లి వస్తానని చెప్పి పారిపోయిన మహిళ ఇంకొకరిని వివాహం ఆడింది. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ యువతిని బోయినపల్లి మండలానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి జరిపించడానికి శివకుమార్ వేములవాడకు వచ్చాడు.

ఫిబ్రవరి 27న పెళ్లి జరగాల్సి ఉంది.. ఈ క్రమంలో శివకుమార్ పెళ్లి కుదిర్చిన సంగతి సంగతి లక్ష్మణ్ కు తెలిసింది. దీంతో మండపానికి చేరుకున్న లక్ష్మణ్, అతని బంధువులు, కుటుంబసభ్యులు శివకుమార్ ని పట్టుకుని నిలదీశారు. అతడిని పోలీసులకు అప్పగించారు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో శివకుమార్, ఆ మహిళ చేసిన మోసాలు వెలుగులోకి వచ్చాయి. 

రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని టార్గెట్ గా చేసుకుని వీరిద్దరూ కలిసి లక్షల రూపాయలు దండుకుంటున్నట్లుగా తేలింది. వీరు పథకం ప్రకారం.. రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తిని ఎంచుకుని.. అతనికి ఆ మహిళను ఇచ్చి పెళ్లి చేసి.. శివకుమార్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ మహిళ భర్తతో గొడవ పెట్టుకుని.. పుట్టింటికని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక తిరిగిరాదు. ఆమె ఆచూకీ ఉండదు. ఇలా… అనేక మందిని మోసం చేసినట్లు వెలుగు చూసింది.