కర్నూల్: రాయలసీమలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, దేవాలయాలకు, మతాలకు పుట్టినిల్లు శ్రీశైలం దేవస్థానంలో ఆపచారాలు జరుగుతున్నాయని బిజెపి పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. దేవస్థానం పరిసరాల్లో అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా మద్య మాంసాల అమ్మకాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు.దినిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. 

''శ్రీశైలం దేవస్థానం పై జరుగుతున్న ఏసిబి విచారణ  తూతూ మంత్రంగా జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై మహానంది నుంచి శ్రీశైలం వరకు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టేందుకు సిద్ధంగా వున్నాం. కానీ కరోనా వల్ల వాయిదా వేశాం'' అని తెలిపారు. 

''శ్రీశైలం దేవస్థాన పరిసరాల్లో మాంసం మద్యం విపరితంగా అమ్మకాలు జరుగుతున్నాయి. నిన్న తనిఖీలో ‌భాగంగా‌ మాంసం మద్యం దొరికింది. దినిపై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి'' అని అన్నారు. 

''ఈ తనిఖీల్లో పట్టుపడిన వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు. పట్టుబడిన మాంసం మద్యంపై పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేసి ఫైన్ లు వేసి పంపించారు.ఇది అంతా రజాక్ అనుచరులు చేశారని... రజాక్ అనే వ్యక్తి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరుడు .ఈ అరాచకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి'' అని బైరెడ్డి ప్రశ్నించారు.