Asianet News TeluguAsianet News Telugu

పులివెందుల: టిడిపికి అందని ద్రాక్షలాగ తయారైంది

  • రాష్ట్రం మొత్తం మీద రెండే నియోజకవర్గాలు చెరో వైపు కంచుకోటలుగా నిలిచాయి.
  • అందులో ఒకటి కుప్పం, రెండోది పులివెందుల. టిడిపి ఆవిర్భావం నుండి కుప్పంలో పార్టీకి ఓటమిన్నది లేదు. ఇక రెండోదైన పులివెందుల మాత్రం వైఎస్ ఫ్యామిలికి కంచుకోటలాగ నిలబడ్డది.
  • వచ్చే ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో ఎలాగైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చంద్రబాబునాయుడు వ్యూహాలు మొదలుపెట్టారు.
  • ఎందుకంటే, పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే టిడిపికి బంపర్ లాటరీ తగిలినట్లే.
Will pulivendula remain a pie in the sky for naidu

రాష్ట్రం మొత్తం మీద రెండే నియోజకవర్గాలు చెరో వైపు కంచుకోటలుగా నిలిచాయి. అందులో ఒకటి కుప్పం, రెండోది పులివెందుల. టిడిపి ఆవిర్భావం నుండి కుప్పంలో పార్టీకి ఓటమిన్నది లేదు. ఇక రెండోదైన పులివెందుల మాత్రం వైఎస్ ఫ్యామిలికి కంచుకోటలాగ నిలబడ్డది. మొదట్లో ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైనా మారిన పరిస్ధితిల్లో వైఎస్ ఫ్యామిలికి అండగా నిలబడిందని చెప్పుకోవచ్చు. అటువంటిది వచ్చే ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో ఎలాగైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చంద్రబాబునాయుడు వ్యూహాలు మొదలుపెట్టారు.

పులివెందులలో టిడిపిని ఎలాగైనా గెలిపించి రికార్డు సృష్టించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకు వ్యూహం కూడా ఏదో మొదలుపెట్టేసే ఉంటారనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే, పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే టిడిపికి బంపర్ లాటరీ తగిలినట్లే. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాలొకటి, పులివెందుల ఒక్కటి ఒకటన్న విషయంలో అనుమానం లేదు. అందుకనే చంద్రబాబు, లోకేష్ మొదలుకుని ప్రతీ ఒక్కరూ పులివెందుల నియోజకవర్గం గురించే కలవరిస్తున్నారు.

మొన్న జరిగిన స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికలో బిటెక్ రవిని గెలిపించుకున్నప్పటి నుండి టిడిపికి ఉత్సాహం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ను ఓడగొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు. అందుకనే పులివెందులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. త్రాగు, సాగు నీరందించటం, సంక్షేమ పథకాలు అమలు చేయటం, మౌళిక సదుపాయాల అభివృద్ధి పై దృష్టి పెట్టారు. ఇవన్నీ తెరపైన కనిపిస్తున్న ప్రయత్నాలు. ఇక, తెరవెనుక చేస్తున్న ప్రయత్నాలు ఎటూ తప్పవు కదా? బిటెక్ రవి, సిఎం రమేష్, ఆదినారాయణరెడ్డి, గంటా, లోకేష్ తదితరులతో కోర్ గ్రూపును ఏర్పాటు చేసారు.

ఇక్కడే ఓ విషయం గమనించాలి. అదేంటంటే, తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుండి ‘అందని ద్రాక్ష’లాగ టిడిపిని ఊరిస్తున్న ఒకే ఒక్క నియోజకవర్గం పులివెందుల. ఎన్టీఆర్ ఆధ్వర్యంలో 1983లో ఎన్నికలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ ఎనిమిది ఎన్నికలు జరిగాయి. ఏ ఎన్నికలో కూడా టిడిపి విజయం సాధించలేకపోయింది. ఎన్టీఆర్ ఎంతో ప్రయత్నించారు అక్కడ గెలవాలని. కానీ సాధ్యం కాలేదు.

1995లో టిడిపిలో అధికారమార్పిడి జరిగింది. రాజకీయ వ్యూహాలు పన్నటంలో ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు నాలుగాకులు ఎక్కువే చదివారు. అప్పటి నుండి పులివెందులపైనే చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. అయినా గెలుపు సాధ్యం కాలేదు. మొదటి నుండి వైఎస్ కుటుంబం కాంగ్రెస్ లోనే ఉంది కాబట్టి కాంగ్రెస్ కు కంచుకోటలాగుండేది. కానీ 2014 నుండి ఆ నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటలాగైపోయింది. బహుశా నంద్యాలలో గెలిచినట్లే రేపటి ఎన్నికల్లో పులివెందులలో గెలవటానికి చంద్రబాబు ప్రత్యేక వ్యూహం సిద్దం చేయకుండా ఉంటారా? అదేంటో ఇపుడు కాకపోయినా మెల్లిగా అయినా బటయపడుతుంది. అప్పుడు జగన్ ఏం చేస్తారో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios