అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇక తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయనున్నట్లు పుకార్లు చెలరేగుతున్నాయి. టీవీ చానెళ్లలో బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి. సోషల్ మీడియాలో అదే విషయం వైరల్ అవుతోంది. ప్రశాంత్ కిశోర్ తో చంద్రబాబు భేటీ అయినట్లు కూడా ప్రచారం సాగుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించారని ప్రచారం సాగింది. టీడీపీకి చెందిన పలువురు నేతలు చంద్రబాబు పీకేను సంప్రదించాలని సలహా ఇచ్చారనే సమాచారం కూడా ప్రచారంలోకి వచ్చింది. 
 
అయితే, ఆ ప్రచారంపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ స్పష్టత ఇచ్చారు.  ప్రశాంత్ కిషోర్‌ను టీడీపీ సంప్రదించినట్లు వస్తున్న వార్తలు అన్నీ పుకార్లేనని ఆయన చెప్పారు. అసలు తాము ఇంతవరకూ ఎవర్నీ సంప్రదించలేదని ఆయన అన్నారు. కొందరు పనిగట్టుకుని ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా ఆ విషయాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. .