రాజకీయ సమీకరణల్లో భాగంగా మరో ఇద్దరు ఫిరాయింపు ఎంఎల్ఏలకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయ్. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో భాగంగా అనేక మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రంలోని టిడిపికి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు. అంతకుముందే చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు బిజెపి మంత్రులు రాజీనామాలు చేశారు. దాంతో మంత్రివర్గంలో రెండు ఖాళీలు వచ్చాయి.

మంత్రివర్గంలో ముస్లింలు, గిరిజనులకు చోటు దక్కని విషయం అందరికీ తెలిసిందే. పైగా వైసిపిలో గెలిచిన ముస్లింలు, గిరిజన ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి మరీ టిడిపిలోకి లాక్కున్నారు. అటువంటి వారిలో మంత్రివర్గంలో చోటిస్తానని అప్పట్లో చంద్రబాబు హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

గడచిన మూడున్నరేళ్ళల్లో చంద్రబాబు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసినా ముస్లింలు, గిరిజనులకు మాత్రం అవకాశాలు ఇవ్వలేదు. దాంతో ఆ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోతోంది. అయితే, ప్రస్తుతం శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల్లో పై వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని చంద్రబాబు అనుకుంటున్నారట.

కాబట్టి ఫిరాయింపుల్లో ముస్లింలకు సంబంధించి జలీల్ ఖాన్ లేకపోతే చాంద్ భాష గిరిజనుల్లో గిడ్డి ఈశ్వరి లేకపోతే కిడారి సర్వేశ్వర్రావు కానీ వంతల రాజేశ్వరికి కానీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపిలో కూడా ఒకరిద్దరు గిరిజనులు, ముస్లింలున్నప్పటికీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫిరాయింపుల్లోని పై వర్గాలకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట.