పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ పోటీ.. ‘పిఠాపురం నుంచి పోటీ చేస్తా’
పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ పోటీ చేస్తానంటూ ప్రకటన చేశారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ఆర్జీవీ ట్వీట్ చేశారు.
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకర్గం నుంచి బరిలో ఉంటానని ట్వీట్ చేశారు. ఇది సడెన్‌గా తీసుకున్న నిర్ణయం అని వివరించారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని తెలిజేయడానికి సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని వెల్లడించిన స్వల్ప సమయంలోనే ఆర్జీవీ ఈ ప్రకటన చేశారు. ఇది వరకు పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ చాలా సార్లు విమర్శలు చేశారు. తరుచూ పవన్‌పై పంచులు విసురుతారు. ఇప్పుడు కూడా ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్‌కు కౌంటర్‌గానే ఈ ట్వీట్ చేశాడా? లేక నిజంగానే పిఠాపురం నుంచి పోటీచేస్తాడా? అనేది తెలియదు. చాలా కాలం నుంచి ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమై.. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీగా పోటీ చేయాలని విజ్ఞప్తులు వచ్చాయని, కానీ, తనకు ఆసక్తి లేదని, పిఠాపురం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.