చంద్రబాబునాయుడు నాయకత్వ పటిమకు వచ్చే ఎన్నికల్లో ఒక్క జిల్లా నిజమైన పరీక్షగా నిలవబోతోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఇపుడు కొత్తగా పరీక్ష ఎదురుకావటం ఏంటనుకుంటున్నారా? నిజమే చంద్రబాబు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి విషయంలో ఆ ఒక్క జిల్లా చంద్రబాబును బాగా ఇబ్బంది పెడుతోంది. టిడిపి నాయకత్వాన్ని చేజిక్కించుకున్న తర్వాత కూడా ‘ఆధిపత్యం’ విషయంలో ఆ జిల్లా చంద్రబాబును ఇబ్బంది వెంటాడుతూనే ఉంది.

ఇంతకీ ఆజిల్లా ఏంటనుకుంటున్నారా? అదేనండి వైఎస్సాఆర్ కడప జిల్లా. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కడప జిల్లాలో చంద్రబాబు ఎత్తులు ఏమాత్రం పారటం లేదు. ఎత్తులు పారకపోగా ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో కావచ్చు లేదా తాజాగా 13 జిల్లాల రాష్ట్రంలో కానీ కడప జిల్లాలో చంద్రబాబు వ్యూహాలేమాత్రం  పారట్లేదు.

పోయిన ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి గెలుచుకున్నది కేవలం రాజంపేట స్ధానం మాత్రమే. జిల్లాలోని రెండు పార్లమెంటు స్ధానాలూ వైసిపినే గెలిచింది.

కడప జిల్లా మాత్రమే చంద్రబాబును ఎందుకంత ఇబ్బంది పెడుతోంది? అంటే, కడప జిల్లా అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ దే హవా. అటువంటిది 2009లో వైఎస్ హాఠాన్మరణం తర్వాత జిల్లాలో టిడిపి జెండా ఎగరటం ఖాయమనుకున్నారు. కానీ విచిత్రంగా జిల్లా ప్రజలు వైఎస్ జగన్ కు కూడా వైఎస్ ను ఆధరించినట్లుగానే ఆధరించారు.

అందుకనే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కడప జిల్లాలో టిడిపి జెండాను ఎగరేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు చాలా కాలంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంకు ప్రత్యకంగా పార్టీ తరపున పరిశీలకులను నియమించారు. వైసిపి ఎంఎల్ఏ ఆదినారాయణ రెడ్డిని టిడిపిలోకి లాక్కుని ఏకంగా మంత్రినే చేశారు. అంతేకాకుండా వైఎస్ కుటుంబం ఆధిపత్యాన్ని దెబ్బకొట్టే బాధ్యతను మంత్రికి చంద్రబాబు కట్టబెట్టారు.

అందులో భాగంగానే సాగు, త్రాగు నీటిపై దృష్టి పెట్టారు. ప్రతీ నియోజకవర్గానికి ఓ ప్రత్యక వ్యూహాన్ని అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. మరి, 2019 ఎన్నికలైనా చంద్రబాబు కోరికను తీరుస్తుందో లేదో చూడాల్సిందే.