రాజీనామాలన్నది చివరి అస్త్రంగానే ఉండాలి. అంతేకానీ ముందే రాజీనామాలు చేస్తామని చెప్పటం, చేయించటం అంత విజ్ఞత అనిపించుకోదు.  

ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేస్తే ఏమవుతుంది? మహా అయితే రాజీనామాలు చేసిన వారు మాజీలవుతారు. జూన్ లోగా కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తమ ఎంపిలందరూ రాజీనామాలు చేస్తారంటూ జగన్ తాజాగా చెప్పారు. దాంతో ఎంపిలు రాజీనామాలు చేస్తే ‘లాభమేమిటి’ అనే చర్చ మొదలైంది. హోదాకు ఇటు రాష్ట్రప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండూ వ్యతిరేకమే. అందుకే ప్రత్యమ్నాయంగా ‘ప్రత్యేకసాయాన్ని’ కేంద్రం తెరపైకి తెచ్చింది. మొన్ననే కేంద్ర క్యాబినెట్ సాయానికి చట్టబద్దతకు ఆమోదం కూడా తెలిపింది.

ఈ పరిస్ధితుల్లో ఎంపిలు రాజీనామా చేస్తే కేంద్రానికి ఏం నష్టం లేదు. ప్రతిపక్ష ఎంపిలు రాజీనామా చేస్తే కేంద్రంపై ఎలా ఒత్తిడిపెరుగుతుందో జగనే చెప్పాలి. ప్రత్యేకహోదా డిమాండ్ తో పాలక, ప్రతిపక్షాల ఎంపిలందరూ రాజీనామా చేస్తానంటే కేంద్రం ఏమన్నా దిగివస్తుందేమో కానీ కేవలం ప్రతిపక్ష ఎంపిలు రాజీనామా చేస్తే ఎవరూ పట్టించుకోరు. ఇప్పటికే వైసీపీ నుండి ఇద్దరు ఎంపిలు జారిపోయారు. రాజీనామాలతో మిగిలిన ఎంపిలు కూడా పదవులను కోల్పోతారేమో. అసలు రాజీనామాలుకు ఎంపిల్లో ఎంతమంది సుముఖంగా ఉన్నారో తెలీదు. మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల విజయంతో జగన్లో మళ్ళీ ఊపొస్తోందేమో.

పైగా ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుంది. అందులోనూ మన వాళ్లకు ఉద్యమాలంటే పెద్దగా ఆశక్తిలేదు. పైగా రాజకీయంగా రాష్ట్రంలో సఖ్యత కూడా లేదు. కాంగ్రెస్, వామపక్షాలు కుదేలైఉన్నాయి. జనసేనకు పార్టీ నిర్మాణమే లేదు. ఈ పరిస్ధితుల్లో ఎంపిలతో రాజీనామాలు చేయించి హోదా కోసం ఉద్యమాలంటే కష్టమే. అదే ఎన్నికలకు ముందు రాజీనామాలంటే ప్రజలు కూడా గుర్తుంచుకుంటారు. ఎప్పుడు కూడా ఉద్యమాలను దశలవారీగా నిర్మించాలి. రాజీనామాలన్నది చివరి అస్త్రంగానే ఉండాలి. అంతేకానీ ముందే రాజీనామాలు చేస్తామని చెప్పటం, చేయించటం అంత విజ్ఞత అనిపించుకోదు.