ప్రకాశం జిల్లాలో ఓ భార్య గుడ్డివాడైన భర్తను చంపాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఇంతలో పెద్దకూతురు లేవడంతో బండారం బైటపడింది. వివరాల్లోకి వెడితే..

ప్రకాశం జిల్లా, మేదరమెట్ల యానాది కాలనీలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న తొట్టెంపూడి పూర్ణచంద్రరావు భార్యతో కలిసి స్థానికంగా పదకొండు సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. 

వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. మేదరమెట్లకే చెందిన సురేష్‌ ఇంట్లో గతంలో వీరు అద్దెకు ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత స్థానికంగా నిర్మించిన ఒక అపార్ట్‌మెంట్లో ప్లాట్‌ కొనుక్కుని అందులోకి మారారు. అయితే సురేష్ తో అప్పటికే పూర్ణచంద్రరావు భార్యకు అక్రమసంబంధం ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ చేసింది. బుధవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న పూర్ణచంద్రరావును ముఖంపై దిండు ఉంచి ఊపిరి ఆడకుండా చేసేందుకు ప్రయత్నించారు. 

అదే సమయంలో పెద్ద కూతురు మేల్కొని కేకలు వేయడంతో సురేష్‌ అక్కడి నుంచి పారిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్య సురేష్ తో వివాహేతర సంబంధం నడుపుతూ తనను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్‌ వేసిందని, సోదరుని సహాయంతో పూర్ణచంద్రరావు ఫిర్యాదు చేశారు. మేదరమెట్ల ఎస్‌ఐ కట్టా అనూక్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.