తనని పక్కన పెట్టి భర్త.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.  దీంతో... భర్త తన ప్రియురాలితో రహస్యంగా ఉంటున్న ఇంటి ముందు కూర్చుని ఆందోళన చేపట్టింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడకు  చెందిన సరితకు ఐదేళ్ల క్రితం చైతన్యతో వివాహమైంది. ఒక పాప కూడా ఉంది. అయితే.. గత కొద్ది రోజులుగా చైతన్య ప్రవర్తనలో మార్పు గమనించింది సరిత. చైతన్య మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న విషయం సరితకు తెలిసిపోయింది. తనకు తెలీకుండానే ప్రియురాలితో వేరే ఇంట్లో కాపురం పెట్టాడన్న విషయం కూడా ఆమెకు తెలిసిపోయింది. 

తొలుత విషయం తెలుసుకున్న సరిత బాధతో కుంగిపోయింది. వెంటనే తేరుకొని తన జీవితం చక్కబెట్టుకోవాలని భావించింది. వెంటనే భర్త ప్రియురాలితో కలిసి ఉంటున్న ఇంటి ముందుకు వెళ్లి ధర్నా చేపట్టింది.  తనను మోసం చేసాడని భార్య సరిత ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లికి కట్నం కింద కోటి రూపాయలు నగదు, 25 లక్షల బంగారం ఇవ్వడం జరిగిందని సరిత మీడియాకు తెలిపింది. ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.